ప్రథిత యశుల్ జలేజహిత వంశపు ఱేండ్లకు నీవు నచ్చు సా
రథివి, నృపుండు ని న్ననుజు రాణను జూచు, సమస్త శాస్త్ర నీ
రథివి, భవద్బలంబున రాజు బెడందలు వాపనెంచు ధీ
రథిషణ పొల్చు మాకిపుడు రా! యొకత్రోవను జూపవేయికన్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, ఇష్టిఖండము లోని యీ పద్యం దశరథుని మంత్రి, రథసారథి అయిన సుమంత్రుని గూర్చి చెప్పింది.
దశరథునికి ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రిపాలుడు, సుమంత్రుడు అనే యెనిమిది మంది మంత్రు లున్నారు. వారిలో సుమంత్రుడు ముఖ్యుడు.
పుత్ర సంతానం లేకపోవడం వల్ల, దశరథుడు చింతాక్రాంతుడవటం గమనించిన మంత్రు లందరూ, సుమంత్రునితో అంటున్నారు:
" యశస్సులో మొట్టమొదటగా చెప్పుకోవలసినది సూర్యవంశాన్ని. అటువంటి సూర్యవంశ రాజులకు హితుడివి, నచ్చిన సారథివి నీవు. అట్లాగే, దశథుడు నిన్ను తమ్ముడిలాగ చూస్తాడు. అంతేగాకుండా, అన్ని శాస్త్రాలను ఔపోసన పట్టిన వాడివి నీవు. మంత్రిగా నీ అండ చూసుకొనే రాజు చిక్కు సమస్యల నుండి బయటపడాలని చూస్తాడు. మేము వేరే చెప్పాలా? నీకు ధైర్యంతో పాటు ప్రతిభ కూడ ఉంది. అందుకని, రాజు దుఃఖాన్ని పోగొట్టడానికి నువ్వే ఒక మార్గం చూపించాలి, రా! "
పైన పేర్కొన్న యెనిమిది మంది మంత్రుల మాటల వల్ల, మనకు సుమంత్రుని ప్రాధాన్యత అర్థమవుతుంది. సుమంత్రుని పాత్రను, పాత్రౌచిత్యాన్ని, ముందు ముందు పెంచడానికి యీ పద్యంలో బీజావాపన జరిగింది.
No comments:
Post a Comment