కాదన కిట్టిపాటి యపకారము దక్షకు డేకవిప్రసం
బోధన జేసి చేసె నృపపుంగవ! నీవు ననేక భూసురా
పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కా
కోదరసంహతిన్ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్.
శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వము, ప్రథమాశ్వాసము లోని ఈ పద్యం, రెండు రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మొదటిది, ఉదంకుడిని పరిచయం చేస్తూ, నన్నయగారు రచించిన పద్య మిక్కడ గమనార్హము.
పంకజసన్నిభు డఘ
పంకక్షాళణ మహాతపస్సలిలు డనా
తంకమతి పైలశిష్యు డు
దంకుం డను మునివరుండు దద్దయు భక్తిన్.
ఉదంకుడెట్టివాడు? బ్రహ్మ వంటివాడు, అఘ పంకక్షాళన మహాతపస్సలిలుడు, భయ మెరుగని మనస్సు కలవాడు. ఇందులో, అఘ పంకక్షాళన మహాతపస్సలిలుడు, అంటే, పాపమనే బురదను, గొప్ప తపస్సనే నీటిచే కడుగ గలవాడు. అంటే, ఒకవేళ పాపం చేయక తప్పని పరిస్థితి వస్తే, దానిని తన తపోశక్తిచే పోగొట్టుకొన గల సామర్థ్యము కలవాడు. అందునా, అనాతంకమతి. అంటే, భయమెరుగని మనస్సు కలవాడు. ఈ మూడు విశేషణములను బట్టి, తక్షకుడు ఎట్టివానికి, (తన కులమునకు ) ఎంత ప్రమాదకరమైన అపకారం చేసాడో ఊహించవచ్చు.
ఇక రెండవది, అకారణంగా, ఉదంకుని వంటి వానికి అపకారం చేసినటువంటి, జనమేజయుని తండ్రి పరీక్షిత్తు మరణానికి కారకుడైనటువంటి, తక్షకుని దుర్మార్గం సహింపరానిది కనుక, శిక్షార్హుడని రూఢి చేసి, జనమేజయుడిని సర్పయాగం చేయడానికి ప్రేరేపించిన హేతువు యీ పద్యంలో కనిపిస్తుంది. ఇక పద్యం అర్థాన్ని తెలుకొనడానికి ప్రయత్నిద్దాము.
" ఓ రాజశ్రేష్ఠుడా! జనమేజయ మహారాజా! ఒక బ్రాహ్మణుని మాట పట్టుకొని (శృంగి శాపం మిషతో), ఈ తక్షకుడు నీ తండ్రికి చేయరాని అపకారం చేశాడు. అందుచేత, నీవు కూడా పలువురు బ్రాహ్మణుల చేత నిర్వహింపబడే సర్పయాగంలో, అగ్నిజ్వాలల్లో తక్షకుడితో సహా మొత్తం సర్పకులాన్ని భస్మం చెయ్యి. "
ఈ పద్యంలో, ఉదంకుని స్వభావం మనకు తెలుస్తుంది. " తక్షకుడు ఒక బ్రాహ్మణుని ప్రేరణతో ఇంత అపకారం నీకు చేశాడు. అందుకని, పలువురు బ్రాహ్మణులు సమ్మతించేటట్లుగా, సర్పయాగం చేసి ప్రతీకారం తీర్చుకో. " అని హేతువును కల్పించడమే గాక, తన కెవడైనా అపకారం చేస్తే, వాడిని వదిలి పెట్టే ప్రసక్తే లేదనే ఉదంకుడి స్వభావాన్ని, అనాతంకమతిని (భయ మెరుగని మనస్సు కలవాడిని) పాఠకుడు యీ పద్యంలో చూస్తాడు.
No comments:
Post a Comment