దిన దినమును ధర్మంబులు
ననయము ధర నడగిపోవు నాశ్చర్యముగా
విను వర్ణచతుష్కములో
నెనయగ ధనవంతుడైన నేలు ధరిత్రిన్.
బలవంతుడైన వాడే
కులహీనుం డైన దొడ్డ గుణవంతు డగుం
గలిమియు బలిమియు గలిగిన
నిల లోపల రాజ తండె యేమన వచ్చున్.
శుక మహర్షి పరీక్షిన్మహారాజుకి కలియుగ ధర్మాలను చెబుతున్నాడు. యుగధర్మాలు మారుతుంటాయి.
మనువు చాతుర్వర్ణ్య వ్యవస్థను దేశ సుస్థిరత కోసం, సమాజ సౌభాగ్యం కోసం, పరస్పర సహకారం కోసం, వ్యష్టి సమష్టి సమన్వయ జీవనం కోసం, మానవాళి మనుగడ కోసం ఏర్పరిచాడు. భారతీయ సమాజంలో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రు లనే నాలుగు కులా లున్నాయి.
కానీ, కలియుగంలో, ఆ సమన్వయ సూత్రం తెగిపోతుంది; ధర్మాచరణ రోజు రోజుకీ తగ్గిపోతుంది. ఆశ్చర్యకరంగా, ధనమున్న వాడే రాజ్యాన్ని పాలిస్తాడు. ఇది ఏ ఒక్క కులానికో పరిమితం కాదు. నాలుగు కులాల్లోను అంతే. నోరున్న వాడిదే రాజ్యం. డబ్బున వాడికే నోరెక్కువ (పలుకుబడి) కనుక, వాడికే రాజ్యం వీరభోజ్యం.
బలమున్నవాడు, కులం లేని వాడైనా, గొప్ప గుణవంతుడిగా కీర్తించబడతాడు. కలియుగంలో, డబ్బున్న వాడే బలవంతుడు. కాబట్టి, సంపద, శక్తి, రెండూ ఉన్నవాడే రాజు, అంటే పరిపాలకుడు అవుతాడు. ఇంతకంటె ఏం చెప్పాలి?
వ్యాసమహర్షి చెప్పిన యీ కలియుగ లక్షణాలు, పదిహేనవ శతాబ్దపు పోతనగారి నాటికి, నేటికీ కళ్ళకు కనబడుతూనే ఉన్నాయి.
సహజకవి పోతనగారిచే ఆంధ్రీకరింపబడిన భాగవతములోని ఏకాదశ, ద్వాదశ స్కంధాలు శిథిలమై పోగా, పోతనగారి ప్రియశిష్యుడు వెలిగందల నారయ వానిని ఆంధ్రీకరించారు. ప్రస్తుత పద్యాలు ద్వాదశ స్కంధం లోనివి.
No comments:
Post a Comment