ధరణీవల్లభు డా ప్రియవ్రతుడు మోదం బందుచున్ లీల నీ
శ్వరవాక్యంబున గర్మతంత్రపరుడై సంగంబులం బాపు శ్రీ
హరి పాదాంబుజ చింతనం దగిలి నిత్యానందముం బొంది దు
ర్భర రాగాదుల బాఱదోలి ప్రజలం బాలించె నత్యున్నతిన్.
స్వాయంభువు మనువు కొడుకు ప్రియవ్రతుడు. గృహస్థాశ్రమం పట్ల విముఖుడైన ప్రియవ్రతునికి బ్రహ్మదేవుడు, " గృహస్థాశ్రమంలో ఉన్నా ఇంద్రియాలను జయించి ఆత్మజ్ఞానం కలిగిన పురుషునికి మోక్షం తప్పక కలుగుతుందని " చెప్పిన విష్ణుమూర్తి సందేశాన్ని తెలియజేసాడు. అనుల్లంఘనీయమైన, విష్ణుమూర్తి ఆదేశాన్ని పాలించి, ప్రియవ్రతుడు స్వాయంభువు మనువు వద్ద నుండి రాజ్యభారాన్ని స్వీకరించాడు.
" రాజైన ప్రియవ్రతుడు భగవంతుని ఆదేశంతో కర్మపరతంత్రుడయినా, రాగద్వేషాలను వదలిపెట్టి, నిరంతర హరి పాదారవింద సేవతో, నిత్యానందాన్ని అనుభవిస్తూ, ప్రజలను గొప్పగా పాలించాడు. "
శుక మహర్షి పరీక్షిన్మహారాజుకి చెప్పిన యీ వృత్తాంతం శ్రీమదాంధ్రమహాభాగవతము పంచమస్కంధములో ఉంది.
No comments:
Post a Comment