గురునకు భక్తుడై పరమాదరమున వే
దాభ్యాస మెప్పుడు నాచరించు
చుచును, శౌచశీలత వినయంబు త్రిషవణ
స్నానంబు భాస్కరానలసపర్య
పాటించుచుండుట బ్రహ్మచారికి వృత్తి;
ధనధాన్యములు గర్హితములు గాని
తెరువున బడసి యతిథిపూజ మున్నుగా
నన్నపానాది భోగానుభవము
బొందువాడు గృహస్థుండు; గందమూల
శాకఫలము లాహారంబు శయ్యభూమి
వననివాసికి నిస్సంగవర్తనమున
భిక్ష బ్రదుకుగ యతి శాంతి బేర్చి యుండు.
శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతిపర్వము, చతుర్థాశ్వాసమునందు భృగువు భరద్వాజునకు ఆశ్రమధర్మాలను సవిస్తరంగా చెప్పడం కనిపిస్తుంది.
భారతీయ సనాతనధర్మ మార్గంలో మనకు నాలుగు ఆశ్రమాలు చెప్పబడ్డాయి. అవి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు.
అందులో మొదటిది బ్రహ్మచర్యం. బ్రహ్మచారి గురుభక్తి కలిగి ఉండాలి. వేదాభ్యాసం నిరంతరం చేయాలి. శుభ్రత పాటించాలి. వినయంగా ఉండాలి. త్రిసంధ్యల్లో స్నానం చేసి, సూర్యుని, అగ్నిని క్రమం తప్పకుండ ఆరాధించాలి. బ్రహ్మచారి మూడుపూటలు హోమం చేయాలి.
గృహస్థ ధర్మంలో ధనధాన్యాలు సంపాదించి, అతిథి సత్కారం చేసి, ఆ పిదప భోజనం చేయాలి.
వానప్రస్థంలో, కందమూలాలు, పండ్లు సేవిస్తూ, నేల మీద పడుకుని నిద్రిస్తూ, జీవితం గడపాలి.
చివరిదైన సన్యాసంలో, అన్నింటి మీద ఆసక్తిని వదలి, భిక్షాటనతో శరీరయాత్ర సాగిస్తూ శాంతిమయ జీవితం గడపాలి.
ఇవన్నీ గమనిస్తే భారతీయ సనాతన సంప్రదాయ జీవనవిధానంలో ఒక క్రమము, పద్ధతి ఉద్దేశించబడి బాల్యంలో, యవ్వనంలో, వార్థక్యానికి ముందు, వార్థక్యంలో యే విధంగా బ్రతుకును పండించుకొని, ఆనందమయ జీవితం గడపాలో నిర్దేశించబడింది.
No comments:
Post a Comment