యౌవనమందు యజ్వయు ధనాఢ్యుడునై కమనీయ కౌతుక
శ్రీవిధి గూకటుల్ కొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ
ఖ్యావహయై భజింప సుఖులై తలిదండ్రులు గూడి దేవియున్
దేవరవోలె నుండి యిలు దీర్పగ గాపురమొప్పు వానికిన్.
పెద్దనగారి మనుచరిత్రము ప్రథమాశ్వాసం లోని ఈ పద్యానికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు ఎంతో చక్కని వ్యాఖ్యానం చేసి, నా వంటి వానికి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. వాటిని నా మాటలలో మీ ముందుంచుతాను.
ప్రవరుని కాపురం ఒడిదుడుకులు లేకుండా చక్కగా సాగిపోతున్నదట. దానికి మూడు కారణాలు చెప్పారు. మొదటిది, యువకుడిగా ఉండగానే సోమయాజి అవటం, ధనవంతుడు కూడా అయిఉండటం. యవ్వనం లోనే యజ్ఞం చేయటం వల్ల నైష్ఠికత అతని సహజ గుణమని భావించాలి. అందువల్ల, సంధ్యావందనం, అగ్నిహోత్రం వంటి నిత్యం జరిగే అనుష్ఠానాలు, కార్యక్రమాలు అతనికి స్వతఃసిద్ధంగానే వచ్చాయి గానీ, ఎవరో బలవంతంగా రుద్దినవి కాదు. అటువంటివాడు, హిమాలయప్రాంతంలో, ఇంటికి తిరిగి వెళ్ళలేని పరిస్థితిలో, అప్సరస వంటి వరూధిని తనంతట తాను వలచానని చెబితే, స్థిరచిత్తంతో నిలబడగలిగాడు. ఇక, తలిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉండటం వల్ల, ధనం కోసం వెనుకా ముందూ చూసుకొనే కష్టాలు తనకు లేవు. ఒకరికింత పెట్టి, తాను తినగలిగే స్థితిలో ఉన్నాడు.
రెండవది, ప్రవరుడి వివాహం. కమనీయకౌతుకశ్రీవిధి చేసారట. అంటే, ఎంతో ఉత్సాహంగా, వైభవంగా, వైదికమార్గంలో, తలిదండ్రులు సకాలంలో వివాహం చేశారు. ఈడు జోడు చూసి చేశారు. కూకటులు కొలిచి చేశారట. పూర్వం రోజుల్లో, ఈడు జోడు కుదిరిందా లేదా అని, జుట్టు ముడులు కొలిచి చేసేవారట. ప్రవరుడు అప్పటికే సోమయాజి కాబట్టి, భార్య సోమిదమ్మ అయింది. అనుకూలవతియైన భార్య దొరికింది. అన్నీ సమయానికి సమకూరుస్తున్నది. ఏ కొరతా లేదు. ఈడు జోడుగా ఉన్నారు కనుక సుఖంగా, ధార్మిక గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నారు.
మూడవది, ప్రవరుడికి పార్వతీపరమేశ్వరుల్లాంటి తల్లిదండ్రులు ఉండటం పెద్ద అండ. కుటుంబ భారం ఇతని మీద పడకుండా, బాధ్యతలన్నీ వాళ్ళే నిర్వహిస్తున్నారు. అతడి పనల్లా, సంధ్యావందనం, అగ్నిహోత్రం చేయటం, వేదాధ్యయనం చేయడం, శిష్యుల చేత చేయించటం, ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను జాగ్రత్తగా చూసుకొనడం. జీవితం, వైదిక మార్గంలో, చక్కగా సాగిపోతున్నది.
ఈ పద్యం ఇప్పటి రోజులకి కూడా చక్కగా అన్వయించుకోవచ్చు. ఆర్థికంగా ఒడుదుడుకులు లేకుండా ఉండి, సకాలంలో తలిదండ్రుల చేతుల మీదుగా వివాహం జరిగి, పెద్దవాళ్ళు మంచీచెడులు చెబుతూ, చీకుచింతా లేకుండా జీవితం సాఫీగా జరిగిపోతుంటే, మనిషికి అంతకంటె ఇంకేం కావాలి?
ఇన్ని విశేషాలున్న ఈ పద్యానికి ఇంత చక్కని వివరణ ఇచ్చిన ఆచార్యులవారికి ప్రణామాలర్పిస్తూ ముగిస్తున్నాను.
No comments:
Post a Comment