పనివడి పూచి పట్టమి సుబంధురధైర్యము నిర్వహింతు నే
నను మతి సొన్పకండుట సమగ్రతపంబున తత్ఫలేచ్ఛ లే
కునికి విమోక్షతృష్ణభర మొందమి కాము నడంచు గాన ని
య్యనువులు లేమి సువ్వె యనపాయతగా నత డాడె భూవరా!
శ్రీకృష్ణుడు ధర్మరాజుకి తత్త్వాన్ని బోధిస్తున్నాడు. రెండక్షరాలు మృత్యువని, మూడక్షరాలు బ్రహ్మమని చెప్పాడు. మమ (నాది) అనే రెండక్షరాలు మృత్యువు, బంధకారణము. న మమ (నాది కాదు) అనే మూడక్షరాలు మోక్షకారణమని కృష్ణుడు చెప్పాడు. ఇది గీతా సారాంశమే. ఆ తరువాత, శ్రీకృష్ణుడు కామగీతలు వివరించాడు. కామగీతలు అంటే కామునిచే బోధింపబడినవి.
" ధర్మరాజా! నేను చెప్పేది విను. పట్టుబట్టి ఒక పనిని చేపట్టకపోవటం, ఈ పని తప్పకుండా చేయగలను అనే స్థిరబుద్ధి లేకపోవటం, గొప్ప తపస్సు చేస్తున్నప్పుడు కూడా ఆ తపఃఫలంలో కోరిక లేకుండా ఉండటం, చివరికి మోక్షం మీద కూడా కోరిక లేకుండా ఉండటం, కాముడిని జయిస్తాయి. కానీ అవి చెప్పినంత తేలిక కావు. కోరికలను జయించటం చాలా కష్టం. అందుకే నన్నెవరూ వదలిపెట్టలేరని కాముడు చెప్పాడు "
ఈ సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధపర్వం, ప్రథమాశ్వాసానికి డాక్టర్ హెచ్.ఎస్. బ్రహ్మానందగారి విశేష్య వ్యాఖ్య పొందుపరుస్తున్నాను.
" అశ్వమేధపర్వం లోని అతి ముఖ్యమైన పద్య మిది. కాముడు మానవుడిని ఎందుకు వెన్నాడుతాడో, అతడిని ఎట్లా జయించవచ్చునో చెప్పే ఉపాయం ఈ పద్యంలో ఉన్నది
మొదటిది - పనిని చేయటం అంటే పూనుకొని చేయాలి. పనిని ప్రారంభించటం జరిగితే అది విఫలమయ్యే ప్రశ్న ఉండదు. అంతే కాదు, ఉద్యమంచి పని చేయాలి. ఉత్సాహంతో చేయాలి. దీనినే 'శ్రద్ధ ' అంటారు. శ్రద్ధాళువు పనిని నిరాటంకంగా చేయగల్గుతాడు. ఈ శ్రద్ధ ఉన్నా ' పూనిక ' మొండి పట్టుదల కాకుండా ఉండాలి.
రెండవది - పనిని తప్పక పూర్తిచేస్తానన్న ' స్థిరబుద్ధి ' ఉండాలి. మధ్యలో వదిలివేయటం, చేతకాదేమో అనటం, చేస్తానని చేయకపోవటం. ఇతరులకు ఒప్పచెప్పటం, ఇట్లాంటి పనులు ' సోమరి ' లక్షణాలు. పని పూర్తి అయ్యేదాకా స్థిరబుద్ధి నశించకూడదు. దీనినే ' ఓర్పు ' అంటారు. 'ఓర్పు ' ఉన్నా ' నా పనే గెలవా ' లన్న మూర్ఖత్వం ఉండరాదు.
మూడవది- మనం చేస్తున్న పనిని తాత్పర్యంతో చేయటం. ఆ నిర్దిష్టలక్ష్యం కార్యసాధనకోసమే తప్ప, కోరికను నింపుకొనటం కొరకు కాకూడదు. దానిని ఏ విషయంలో కూడా ఫలాపేక్ష లేకండా ఉండటం అని ఇక్కడ చెప్పుతున్నారు.
నాలుగవది - మోక్షవిషయంలో కూడా కోరిక ఉండకూడదనటం అంటే మోక్షం పొందాలన్నది ఒక ' దాహ ' మట. దాహమయిన మనిషి నీటికొరకు వెదకి తీరుతాడు. మోక్షం దానంతట అది రావాలి తప్ప నీవు ప్రయత్నం చేసి కృత్రిమంగా అందుకొనగలిగింది కాదన్న జ్ఞానం ఉన్నప్పుడు మనిషి ఆ మోక్షాన్ని కోరడు.
' అనువు ' అంటే దారి / ఉపాయం అని అర్థాలున్నాయి. కామజయం అతి కష్టం కాదని అర్థం.
No comments:
Post a Comment