విప్పెసలారు మోముపయి వేలుపువాహిని యెఱ్ఱయొండు బొ
ట్టొప్పగ స్నానమున్ సలిపి యొడ్డున నట్టిటు తిర్గుచున్ జరీ
కుప్పడమంచు ధోవతిని గొంగులువారగ నారబట్టు నే
గొప్పద్విజుండ వొక్కొయిటకుం జనుదెంచితి మత్సఖుండవై.
శ్రీనాథ కవిసార్వభౌముని శృంగారనైషధము కావ్యంలో, హంస నలదమయంతుల మధ్య దౌత్యం (రాయబారం) నెరిపింది. ఆ స్ఫూర్తితో, కవిసమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ గారు తమ అత్యుత్తమ కావ్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధకాండము, సంశయ ఖండంలో, హంసదౌత్యాన్ని ప్రవేశపెట్టారు.
విశ్వనాథవారి పద్యం యెంత అందంగా, బిగువుగా ఉంటుందో, వచనం కూడా అంత అందంగా, బిగువుగా ఉంటుంది. ఇక్కడ విశ్వనాథవారు చక్కని వచనం వ్రాసారు.
" ఆంత మహాసేనవోని సముద్రంబునకును సముద్రంబువోని మహాసేనకును నడుమ నున్న శ్రీరామచంద్రమూర్తి పశ్చిమ సంధ్యోపాసనాంతమున నొక్క శిలాతలంబున నాసీనుండై సంజ యెఱ్ఱదనమ్ములు చివళ్ళ నదిమిన సాగర వీచీకాంతి పరీణత రాజహంస కుడికంటి మలపుల మెలపులుగా జూచి. "
భగవంతుడైన శ్రీరామచంద్రుని ధ్యానించి, ఆ దివ్యత్వాన్ని హృదయంలో నింపుకొని, రాజహంసను భ్రూమధ్యంలో నిలుపుకొంటే, రాజహంసగా వచ్చిన శివుడు ప్రత్యక్షమవుతాడు.
విశ్వనాథవారు, ఈ ఖండానికి సంశయ ఖండమని నామకరణం చేశారు. రావణుని అనుమాన మేమంటే, విష్ణువు రాముడిగా తనను సంహరించడానికి వచ్చాడా అని, యీ రామునికి సీతకు మధ్య శివుడు రాయబారం నెరపడానికి వచ్చాడా అని. రావణుని మదిని తొలుస్తున్న యీ భావాలన్నీ మనం తరువాత పద్యాలలో చూస్తాము. ప్రస్తుతానికి , పద్యం యొక్క అందాన్ని చూద్దాము.
రాజహంస ఎట్లా ఉన్నది? విశాలమైన ఫాలభాగం మీద, గంగానది ఒడ్డున ఉన్న యెఱ్ఱ ఒండ్రుమట్టిని బొట్టుగా పెట్టుకొని, స్నానం చేసి వచ్చి, ఒడ్డున అటూ ఇటూ తిరుగుతూ, జరీ అంచుల ధోవతి కొంగులు పుచ్చుకొని, గాలికి ఆరబెట్టే గొప్ప బ్రాహ్మణుడి వలె ఉంది. ద్విజుడు అంటే పక్షిజాతికి చెందినది, బ్రాహ్మణుడని రెండు అర్థాలు.
హంస తెల్లగా ఉంటుంది. ఱెక్కలు బంగారం రంగులో, ముక్కు యెఱ్ఱగా ఉంటాయి.
ఱెక్కలు విప్పుకొని అటూ ఇటూ తిరుగుతున్న హంస, ముఖాన బొట్టు పెట్టుకొని, జరీ అంచుల ధోవతి కొంగులను పుచ్చుకొని, ఆరబెడుతున్న బ్రాహ్మణుడిలా వర్ణించడం ఎంతో ఔచిత్యభరితంగా ఉంది. వేలుపువాహిని, అనగా, స్వర్లోకగంగ. ఎంతో పవిత్రమైనది. వేలుపువాహినిలో స్నానం చేసి వచ్చిన బ్రాహ్మణుడు పవిత్రత పొందినవాడు.
No comments:
Post a Comment