అదియేమే రఘురామచంద్రునకు బాలా! తుమ్మిపూ ల్మాలగా
గుదిగ్రుచ్చన్ మదినెంతు రాము డటవీ గుంజాగళాంకుండు దా
రదకంఠుండు కిరాతరాజటె? గృహారామంబు కోరళ్ళు మొ
గ్గు దలల్ నిండగ గమ్మతావి ముసరౌ గోరింటపూలుండగన్.
శ్రీరామచంద్రుడు, సీతాసమేతుడై, లక్ష్మణునితో పాటు వనవాసానికి వస్తున్నాడని మున్యాశ్రమాలకు వార్త చేరింది. మున్యాశ్రమాల్లో అవతారమూర్తియైన రామునికి స్వాగతం పలకటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వృద్ధ మునికాంతలు, కన్యలకు చిన్న చిన్న పనులను అప్పగించారు. అందులో ఒకటి పూలమాలలు కట్టడం. కొంతసేపయిన తరువాత, ఈ కన్నెపిల్లలు మాలలు యెట్లా కడుతున్నారో చూద్దామని మునికాంతలు అక్కడకు వచ్చారు. వారు చేస్తున్న పని చూసి వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదీ యీ పద్యానికి నేపథ్యం. మునికాంతల ఆశ్చర్య ప్రకటనే యీ పద్యం.
" అమ్మాయి! ఏమిటే నువ్వు తుమ్మి పూలతో మాల కడుతున్నావు? రాముడేమన్నా ఆటవికుడిలాగా మెడలో గురిగింజలు, పూసలు ధరించే వాడా? విషాన్ని కంఠంలో దాచిన వాడా? లేకపోతే కిరాతరాజా? అయ్యో! ఈ చుట్టుప్రక్కలంతా కమ్మని వాసనలు విరజిమ్ముతూ పసుపుపచ్చని గోరంట పూలుంటేనూ? "
తుమ్మిపూలు పొదల్లో, తుప్పల్లో, దారిప్రక్కన పూచే, చేతికి కూడా అందని చాలా చిన్న పూలు. వాటిని ఎవరూ పట్టించుకోరు, ఎవరికీ ఇష్టమైనవి కావు. ( ఒక్క శివునికి తప్ప). అటువంటి పూలను సేకరించి, ఒకదాని తరువాత ఒకటి గ్రుచ్చడం పెద్ద పని. మరి, ఈ పిల్లలు ఆ పని చేస్తున్నారు. తుమ్మిపూలు శివునికి ఇష్టమని విషయ పరిజ్ఞానమున్న మునికాంతలకు తెలుసునేమో? పూసలు మెడలో వేసుకున్నవాడు, విషాన్ని కంఠంలో దాల్చిన వాడు, కిరాతరాజు, శివుడని, తెలిస్తే తెలిసి ఉండవచ్చుగాని, తుమ్మిపూలు ఇష్టమైన వాడు శివుడని, మీకు కూడా తెలిసిపోయిందా, ఆ వచ్చే రాముడు, శివుడేననే రహస్యం, బహుజన్మల తపఃఫలంగా గాని తెలియని యీ మహార్థము మీకు కూడా తెలిసిపోయిందా? అనే భావం స్ఫురించేటట్లు, మునికాంతలు ఆశ్చర్యాన్ని ప్రకటించారు.
మునికాంతలు పెద్దవారు కనుక కొన్ని సూక్ష్మమైన రహస్యాలు తెలుసు. శివునికి తుమ్మిపూలు ఇష్టమని, రామునికి గోరంటపూలు ప్రీతికరమని, పల్లీయులకు, మునిపల్లెల్లో ఉన్న పెద్దవారికి తెలుసు. బహుజన్మల తపఃఫలంగా లభ్యమయ్యే శివకేశవుల అభేదజ్ఞానం, రాముడే శివుడనే యెరుక, ఇంత చిన్న పిల్లలకు యెట్లా తెలుసా అన్నదే, మునికాంతల ఆశ్చర్యానికి కారణం. ఇదే, ఈ పద్యం లోని ధ్వనిపూర్వక రహస్యార్థం.
శివకేశవుల అభేదాన్ని ధ్వనిపూర్వకంగా తెలియజేసిన ఇంత మంచి, యింత అందమైన పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్యకాండము, దశవర్ష ఖండములో ఉంది.
No comments:
Post a Comment