ఈ కాంతాజనరత్న మెవ్వరిదొకో? యీ యాడురూపంబు ము
న్నే కల్పంబుల యందు గాన; మజు డీ యింతిన్ సృజింపంగ దా
లేకుం టెల్ల నిజంబు; వల్లభత నీ లీలావతిం జేరగా
నే కాంతుండు గలండొ? క్రీడలకు నాకీ యింతి సిద్ధించునే?
మోహినీ రూపాన్ని చూడాలన్న శివుని కోరికను మన్నిస్తూ , ఆ రూపాన్ని చూడగానే చిత్తవిభ్రమానికి లోనవ్వద్దని విష్ణువు శివునికి సలహా ఇచ్చాడు. ఆ తరువాత విష్ణువు అంతర్ధానమయ్యాడు. విష్ణువు కనుపించకపోయేసరికి శివుడు అతని కోసం అన్ని దిక్కులా వెదుకసాగాడు. ఆ సమయంలో, ఒక సుందరోద్యానవనంలో, చెట్లవరుసలో, వయ్యారంగా నిలుచున్న ఒక సుందరి కనబడింది. గాలికి ఆమె పైటచెంగు కొంచెం తొలిగింది. దాన్ని సర్దుకోవడానికి ఆమె వంగగా, ఆమె స్తన సౌందర్యం అచ్చెరువు గొలుపుతూ ఉంది. ఆమె ముంగురులు జారి వీపు మీద వ్రేలాడుతున్నాయి. ఆమె నడుము ఉందా లేదా అన్నంత సన్నగా అందంగా ఉంది. చెవులకు పెట్టుకున్న ఆభరణాలు ప్రకాశిస్తూ, ఆ కాంతి ఆమె చెక్కిళపై పడుతున్నది. మెల్లగా నడుస్తుంటే, పిఱుదుల బరువుతో పాదాలు తడబడుతున్నాయి. లేడిలాగా బెరుకు చూపులు చూస్తుంటే, చూసేవాడి గుండెలో సూటిగా గుచ్చుకొంటున్నాయి. జారిపోతున్న చీర కుచ్చెళ్ళను ఎడమచేతితో పట్టుకొని, బంతితో ఆదుతున్న ఆ సుందరిని శివుడు చూసాడు. చూసి, మైమరపు చెందాడు.
ఈ సందర్భంలో అద్భుతమైన వచనం వ్రాసారు పోతనగారు. " కానీ మున్ను మగువ మరగి సగమయిన మగవా డమ్మగువ వయో రూప గుణ విలాసంబులు దన్ను నూరింపం గనుఱెప్ప వ్రేయక తప్పక చూచి మెత్తనయిన చిత్తంబున " అని వ్రాసారు.
పార్వతీదేవి సౌందర్యానికి మురిసి సగమై పోయాడట శివుడు. శివుడు అర్థనారీశ్వరుడు. ఇప్పుడు యీ సుందరి అందానికి బందీ అయిపోయిన శివుని పరిస్థితి ఏమిటి? అనేది తెలియజేసేదే యీ పద్యం. శివుని మనస్సులో కోరిక సుడులు తిరుగుతున్నది.
" ఎవరబ్బా! ఈ అమ్మాయి ! ఏ కల్పంలోను ఇంత అందమైన అమ్మాయిని చూడలేదే? ఈమెను బ్రహ్మగారయితే సృష్టించి ఉండడు. ఈ సుందరిని ఇల్లాలుగా పొందేవాడు యెంత అదృష్టవంతుడో గదా! ఈమెతో క్రీడించే భాగ్యం నాకు లభిస్తుందా? "
ఇదీ శివుని మానసిక పరిస్థితి.
సాక్షాత్తు భగవంతుడే యీ మనోవికారానికి లోనయితే, ఇక సామాన్య మానవుల సంగతి ఏమిటి?
పద్యం మూడవ పాదంలోని " లీలావతి ", చివరి పాదంలోని " క్రీడలకు " అనే పదాలు సార్థకములు, అర్థవంతమైనవి.
ఒకే చైతన్య రూపాలైన ఇద్దరూ, మాయ (అవిద్య) యెంత బలీయమో ప్రపంచానికి తెలియజేయడానికి, క్రీడగా, లీలగా ఆడుతున్న జగన్నాటకమే యీ తంతు అని సమన్వయం చేసుకోవచ్చు. ఆట ఆడటానికి ఇద్దరు ఆటగాళ్ళు ఉండాలి గదా! వారు సమ ఉజ్జీలై ఉండాలి. వారే శివకేశవులు.
No comments:
Post a Comment