విమలాంబువుల నుపస్ప
ర్శము నిర్వర్తించి గో ప్రచయ మధ్యమునన్
దమయుతముగ గోమతి చి
త్తమున జపించిన శుచిత్వ ధన మొడగూడున్.
అగ్ని సన్నిధి గోనిచయంబు నడుమ
బ్రాహ్మణుల పాల గోమతీపఠన మాచ
రించినను విన్న గోర్కి సిద్ధించు; గోవు
గడచినట్టిది లేదు జగత్రయమున.
వ్యాసమహర్షి శుకునికి చెప్పిన గో ప్రభావాన్ని భీష్ముడు ధర్మరాజుకు చెబుతున్నాడు.
ఈ సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ప్రచురింపబడిన శ్రీమదాంధ్ర మహాభారతము, ఆనుశాసనిక పర్వము, తృతీయాశ్వాసమునందలి యీ రెండు పద్యములకు విశేష వ్యాఖ్య వ్రాసిన ఆచార్య శలాక రఘునాథశర్మగారికి నమస్కరిస్తున్నాను.
ఉపస్పర్శం అంటే కేశవ నామాలతో ఆచమనం చేయటం. స్నానం వల్ల బాహ్య శరీరం శుద్ధి అయినట్లు, నీటితో ముమ్మారు భగవన్నామములను ఉచ్ఛరిస్తూ, ఆచమనం చేయడం వల్ల సూక్ష్మశరీర శుద్ధి కలుగుతుంది. ఆ తరువాత, ఆవులమంద మధ్యలో, ఇంద్రియాలను నిగ్రహించి (దమయుతముగను) , " గోమతి " మంత్రాన్ని హృదయంలో జపిస్తే, మానవుడికి పవిత్రత అనే ధనము (శుచిత్వధనం) సమకూరుతుంది.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. జపం చేయడంలో మూడు విధాలున్నాయి. మొదటిది, పెద్దగా మంత్రాన్ని ఉచ్ఛరించడం. రెండవది, పెదవులు కదపకుండా మనస్సులో అనుకొనడం. మూడవది, అత్యుత్తమమైనది, మంత్రాన్ని, మంత్రార్థాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకొనడం. అందుకనే, ' చిత్తమున జపించిన ' అని వ్యాసభగవానుడు చెప్పాడు.
' శుచిత్వ ధన మొడగూడున్ ' - పవిత్రత అనేది ధనం. మానవశరీరం ఎన్నో మలినాలతో కూడుకున్నది. స్నానంతో, బయట మాలిన్యం తొలుగుతుంది. హృదయంలో పరమాత్మను జపించడం వల్ల అంతఃశ్శుద్ధి కలుగుతుంది.
ఇక రెండవ పద్యంలో, అగ్ని దగ్గర, గోవు దగ్గర, బ్రాహ్మణుని సన్నిధిలో " గోమతి " మంత్రాన్ని పఠించినా, విన్నా, అన్ని కోరికలు తీరుతాయని వ్యాసులవారు చెబుతున్నారు. అంటే, అగ్ని , గోవు, బ్రాహ్మణుడు అంత పవిత్ర స్వరూపాలని భావం. చివరగా, గోవును మించినది మూడులోకాల్లోనూ ( స్వర్గము, మర్త్యము, పాతాళము) లేదని ఘంటాపథంగా చెబుతున్నాడు వ్యాసమహర్షి.
No comments:
Post a Comment