అనవుడు నిట్లనున్ విదురు " డక్కట! ధర్మసుతుండు బాంధవుం
డును చెలికాడునుం దగు భటుండును బ్రెగ్గడయున్ గురుండు గా
డె నృపవరేణ్య! నీకు? బ్రకటీకృత సత్త్వుడు శాంతమూర్తి స
ద్వినయ వివేక శీలముల విశ్రుతు డాతడు గీడు వల్కునే?
ధృతరాష్ట్రుని కోరిక మీద పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళాడు సంజయుడు. తిరిగివచ్చిన తరువాత, సంజయుడు అక్కడి విశేషాలను చెప్పి, మరునాడు మరికొన్ని చెబుతానన్నాడు. ఆ రాత్రి నిద్రపట్టక, ధృతరాష్ట్రుడు విదురునికి కబురంపించాడు. విదురుడు ధృతరాష్ట్రునికి నిద్రపట్టకపోవడానికి కారణాలను విశ్లేషించాడు. సంజయుని సందేశం విన్న తరువాత, ధర్మరాజు మనోగతం తెలియకపోవడం తన దుఃఖానికి కారణమని ధృతరాష్ట్రుడు మనసులో మాట బయటపెట్టాడు. అప్పుడు, విదురుడు ధర్మరాజు ఉదాత్తతను యీ విధంగా కొనియాడాడు.
" రాజా! ధర్మరాజు నీకు చుట్టము, స్నేహితుడు, తగిన బంటు, మంత్రి, రక్షకుడు (హితము బోధించేవాడు), కాడా? స్పష్టంగా సత్త్వగుణం కలవాడు, శాంతస్వభావం కలవాడు, వినయం, వివేకం, శీలం, అనే గుణాలకు ప్రసిద్ధుడయినవాడు (ధర్మాన్ని విడిచి) తప్పు మాట్లాడతాడా? "
తిక్కన భారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసములో చెప్పబడిన పై గుణాలు ధర్మరాజు వ్యక్తిత్త్వాన్ని సూచిస్తున్నాయి.
No comments:
Post a Comment