ఘనతన్ నీ మగపోడుముల్ పలుమఱుం గన్నార గన్నార; మే
నిను విన్నార చూడమెన్నడును నీ యాడుజందంబు మో
హినివై దైత్యుల గన్ను బ్రామి అమృతం బింద్రాది దేవాళి కి
చ్చిన నీ రూపము జూపుమా; కుతుకముం జిత్తంబునం బుట్టెడిన్.
శివుడు, పార్వతీ సమేతంగా, ప్రమథ గణాలతో పాటు, శ్రీ మహావిష్ణువుని చూడటానికి వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణువు శివుడు ఇద్దరూ పరస్పరం గౌరవించుకొన్న తరువాత, శివుడు తన మనసులో మాట బయటపెట్టాడు. ఏమిటది అన్నదే, శ్రీమదాంధ్ర మహాభాగవతము, అష్టమస్కంధం లోని యీ పద్యం.
" మాధవా! ఇంతకు ముందు, మగవాడిగా నీ అందాన్ని గురించి ఎన్నోసార్లు విన్నాము, చూసాము. కానీ, దేవ దానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు, నీవు మోహిని రూపం ధరించి, దానవుల కన్ను గప్పి, ఇంద్రాది దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చిన ఆ రూపాన్ని చూడాలని ఉంది. దాన్ని నాకు చూపించు. నా మనసు ఆరాటపడుతున్నది. "
విష్ణుమాయను తప్పించుకోవడం ఎవరి వల్లా కాదు. ఈ జగతికి ఇద్దరే ప్రభువులు. వారే విష్ణువు, శివుడు. అటువంటి శివుడు కూడా విష్ణుమాయకు అతీతుడు కాడని యీ పద్యం తెలియజేస్తుంది.
శివకేశవులకు భేదం లేదు. మాయ, లేదా, అవిద్య ప్రభావం యెంత గట్టిదో, ప్రపంచానికి చూపడమే యీ పద్యం ఉద్దేశ్యం.
No comments:
Post a Comment