కాలము దేశమున్ గ్రతువు గర్మము గర్తయు భోక్తయున్ జగ
జ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము నగ్ని యాహుతుల్
వేళలు విప్రులున్ జనన వృద్ధి లయంబుల హేతుభూతముల్
లీలల దానయై తగ వెలింగెడు నెక్కటితేజ మీశుడున్.
ధర్మరాజు రాజసూయ యాగము చేస్తున్నాడు. ఋత్విక్కులను, పెద్దలను పూజింపదలచుకున్నాడు. అగ్రపూజ చేయడానికి అర్హుడు యెవరని సదస్యులను అడిగాడు. ఎవరికి తోచిన రీతిలో వారు చెప్పారు. అప్పుడు, " వివేకశీలుండును, చతురవచనకోవిదుండును నగు సహదేవుండు భగవంతుండును, యదుకులసంభవుండును నైన శ్రీకృష్ణుని " చూపించి " యిమ్మహాత్ముని సంతుష్టుం జేసిన భువనంబు లన్నియుం పరితుష్టి " నొందుతాయన్నాడు.
సహదేవుడు అగ్రపూజకు శ్రీకృష్ణుడు అర్హుడని యెలా నిర్ణయించాడో చూద్దాము.
దేశకాలాలు, యజ్ఞం, యజ్ఞక్రియాకలాపం, యజ్ఞకర్త, యజ్ఞభోక్త అన్నీ భగవంతుడైన శ్రీకృష్ణుడే. అన్ని లోకాలు, వాటిని రక్షించే దైవము, గురువు శ్రీకృష్ణుని స్వరూపాలే. సాంఖ్య యోగము, మంత్రము, అగ్నిహోత్రము, అందు సమర్పించే ఆహూతులు, వాని యొక్క వేళలు, అవి నిర్వహించే బ్రాహ్మణులు, అన్నీ శ్రీక్జృష్ణుని పరంగా చేసేవే. సృష్టి స్థితి లయకారకుడు భగవంతుడైన శ్రీకృష్ణుడే. పైన చెప్పిన అన్నిటియందు, అందరి యందు ప్రకాశించే వెలుగు, ఏకైక దివ్యస్వరూపుడు శ్రీకృష్ణుడు. అందువల్ల, శ్రీకృష్ణుడు తప్ప ఇంకెవరూ అగ్రపూజకు అర్హులు కారని సహదేవుని నిష్కర్ష.
ఈ పద్యం సహజకవి పోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమ స్కంధము లోనిది.
No comments:
Post a Comment