ఈ రోజు అనుకోకుండా కవికోకిల దువ్వూరి రామిరెడ్డిగారి " గులాబితోట " అనే పద్యంకావ్యం నా చేతిలోకొచ్చింది. అది పారశీక మహాకవి సాదు రచనకు తెనుగుసేత. ఎన్నాళ్ళ క్రిందో చదివాను. మళ్ళీ చదవాలనిపించింది. మొదటి అధ్యాయంలోని విశేషాలే సూటిగా గుండె లోతుల్లోకి వెళ్ళి, మెత్తని చోట్లని స్పృశించాయి. ఆ అనుభూతిని మీతో పంచుకోవాలనే తపన, " గులాబితోట " నుండి అందమైన గులాబీలను మీకు స్నేహపూర్వకంగా ఇవ్వాలన్న యీ ప్రయత్నం.
ఒకానొక పాదుషా ఒక నేరస్తుడికి మరణశిక్ష విధించాడు. చావు తప్పదని నిశ్చయించుకొన్న ఆ ఖైదీ, తన స్వంత భాషలో పాదుషాను తిట్టడం మొదలుపెట్టాడు. " ఏం మాట్లాడుతున్నాడు " అని పాదుషా అడిగాడు. అక్కడున్న సత్పురుషుడైన ఒక వజీరు, " మహాప్రభూ! కోపాన్ని అణచుకొని దీనులను మన్నించేవారిని సర్వేశ్వరుడు కనికరిస్తాడు " అని అంటున్నాడని చెప్పాడు. ఆ మాటలకు కరిగిపోయిన పాదుషా, అతని మరణశిక్షను రద్దుచేసాడు. ఆ వజీరంటే గిట్టని ఇంకొక వజీరు " ప్రభూ! నాకు ఏలినవారి యెదుట నిజం తప్పితే ఇంకొకటి చెప్పడం రాదు. ఈ ఖైదీ మిమ్మల్ని చెప్పలేని మాటలతో తిట్టాడు. " అన్నాడు. ఇది విన్న పాదుషా, ముఖం ప్రక్కకు తిప్పుకొని:
" నువ్వు చెప్పిన నిజం కన్నా, అతడు చెప్పిన అబద్ధం యెంతో ప్రియమైనది. ఎందుకంటే, అందులో, సదుద్దేశం ఉంది. నీ మాటల్లో అసూయ ఉంది. " అన్నాడు.
తాను జెప్పినట్లు తప్పక వర్తించు
నృపుని కెవ్వడైన నెన్నడేని;
మంచిమాట దప్ప మరియేమి చెప్పిన
నకట! కీడుదెచ్చు; నఘము వచ్చు. "
అని పెద్దల మాటలను చెప్పాడు.
అంతేగాక, ఫరిదీను చక్రవర్తి సౌధంలో వ్రాయబడిన సూక్తులను యీ సందర్భంగా చెప్పాడు.
స్థిరముగా దెవ్వరికైన ధరణితలము,
మనసు దేవునిపై నిలుపుకొనుము; చాలు;
న్నిన్నుబోంట్లెందరనొ పెంచి మన్ను సేయు
నవనిని తలాడగా నమ్మి యానుకొనకు.
యెప్పుడో యొక్క నాడంతు చెప్పకుండ
విమలజీవము దేహమున్ విడునుగాన,
రాచగద్దియ మరణంబు ప్రాప్తమైన,
దుమ్ములో బడి చచ్చిన దుదకు నొకటె.
" ఇంతియె గదా! భువి నాల్గు చెరంగు లేలినన్ " అన్నాడు విశ్వనరుడు జాషువా. అంతేగదా!
No comments:
Post a Comment