ధనపతితో దరిద్రునకు, దత్త్వవిదుండగు వానితోడ మూ
ర్ఖునకు, బ్రశాంతుతోడ గడు గ్రూరునకున్, రణశూరుతోడ భీ
రునకు, వరూధితోడ నవరూధికి, సజ్జనుతోడ గష్టదు
ర్జనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడగూడ నేర్చునే?
ద్రోణుడు, ద్రుపదుడు బాల్యమిత్రులు, సహాధ్యాయులు. ఆ స్నేహాన్ని పురస్కరించుకొని ద్రుపదుణ్ణి పలుకరించడానికి వెళ్ళాడు ద్రోణుడు. ఇద్దరి మధ్య నున్న అంతరం తెలియకుండ, యీ విధంగా తన స్నేహితుడనని చెప్పడం తగదని ద్రోణుణ్ణి ద్రుపదుడు అవమానించాడు.
" ధనవంతుడితో దరిద్రునికి, జ్ఞానితో మూర్ఖుడికి, శాంతి కోరుకునేవాడితో క్రూరునికి, వీరునితో పిరికివానికి, రక్షాకవచం ఉన్నవానితో అది లేనివానికి, మంచివానితో చెడ్డవానికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది? " అని ద్రుపదుడు మిత్రధర్మం పాటించకుండా, స్నేహితుడిని అవమానపరిచాడు.
ఈ పద్యంలో ద్రుపదుడు ఆత్మస్తుతికి, పరనిందకు పాల్పడటం స్పష్టంగా కనపడుతుంది. ద్రుపదుడు తనను తాను ధనవంతుడిగను, జ్ఞానిగను, శాంతికాముకుడిగను, వీరునిగను, సురక్షితునిగను, సజ్జనునిగను చెప్పుకొని, అందుకు భిన్నంగా, ద్రోణుణ్ణి దరిద్రునిగను, మూర్ఖుడిగను, క్రూరునిగను, పిరికివానిగను, అరక్షితునిగను, దుర్జనునిగను క్రమంగా చిత్రించాడు. ఆత్మాభిమానం కల ద్రోణుణ్ణి యిది తీవ్రంగా బాధించి ఉంటుంది. తరువాత కాలంలో ద్రుపద ద్రోణుల మధ్య పెరిగిన దూరానికి, వైరభావానికి అంటుగట్టి, పాదులు తీసినవాడు ద్రుపదుడు.
నన్నయ భారతము ఆదిపర్వము పంచమాశ్వాసములోని ఈ పద్యం నన్నయ రుచిరార్థసూక్తి నిధిత్వానికి మంచి ఉదాహరణ.
No comments:
Post a Comment