అంగళ్ళలోన గ్రయ్యంబులై యిడిన శిశుశ్రేణి యాట వస్తువులు చూచి
యేరైన గొని యింటి కేగుచో దారిలో దోతెంచు నుయ్యెలతొట్లు గాంచి
చిత్రపటంబులన్ జిన్ని పిల్లలు నవ్వుచున్నట్లు వ్రాసిన యొఱపు లరసి
యెందైన బసిపిల్ల లేడ్చుచున్నట్లు విన్పించిన చెవియొగ్గి విని చలించి
తన మనోవాంఛ యెల్ల సంతానమయము
గాగ నజ ధారణీపతి కన్నకొడుకు
ధరణి రాజ్యకార్యముల మధ్యమున గూడ
దన్నె విస్మృతి గని పరధ్యాన మందు.
ఈ సీసపద్యం దశరథుని మనస్సులో గూడుకట్టుకొని ఉన్న పుత్రకాంక్షను బహిర్గతం చేస్తుంది.
ఎప్పుడైనా రథంలో రాచవీధుల్లో వెళ్తున్నప్పుడు, అంగళ్ళలో పిల్లల ఆటబొమ్మలు కనపడినప్పుడు, దారిలో యెవరైన, వాళ్ళ పసిపిల్లల కోసం ఉయ్యాలతొట్లు తీసుకు వెళ్తుంటే, చిత్రపటాల్లో చిన్నపిల్లల నవ్వే ముద్దుముఖాలు కనపడినప్పుడు, ఎక్కడైనా పసిపిల్లల ఏడుపు వినిపిస్తే, వారి ఏడుపుకి చలించిపోయి, దశరథుని మనస్సులోని కోరిక పుత్రసంతానం ఒక్కటే అన్నట్లుగా, అజమహారాజు కన్నకొడుకు దశరథుడు, రాజకార్యాలు నిర్వహిస్తూ కూడా, పుత్రవాంఛ కలిగి, తన్ను తానే మైమరచిపోయి, పరధ్యానంగా ఉంటున్నాడు.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, ఇష్టి ఖండము లోని యీ పద్యం సంతానం లేనివారికి, ఆ వాంఛ యెంత బలీయంగా ఉంటుందో తెలియజేస్తుంది.
No comments:
Post a Comment