ఏమఱి రక్ష సాలని మృగేంద్రుని నక్కయు గోలుపుచ్చు, సం
గ్రామములోన గన్గలిగి కావక తక్కిన నా శిఖండిచే
నీ మనుజేంద్రు గోల్పడమె? యిట్టిది గోల్పులి నిద్రవోవ ను
ద్దామ బలంబుమై గొఱియ దాకి వధించినయట్టు లుండదే.
సంజయుడు ధృతరాష్ట్రునికి, మొదటిరోజు భీష్ముని సేనాధిపత్యం క్రింద సాగిన భారత యుద్ధం గురించి చెబుతున్నాడు.
" ఆ రాత్రి నీ దగ్గర నుంచి నేను మన సేనా శిబిరానికి వెళ్ళాను. అక్కడ, దుర్యోధనుడు తన తమ్ముడు దుశ్శాసనుడితో కురుశ్రేష్ఠుడైన భీష్ముని రక్షించుకోవలసిన ఆవశ్యకతను వివరిస్తున్నాడు. భీష్ముడిని రక్షించుకొనటమేమిటని ఎవరికైనా సందేహం వస్తుంది కనక, దానికి వివరణ ఇస్తున్నాడు.
భీష్ముడు మహావీరుడనే దానిలో సందేహం లేదు. అయితే, ఆయన అంతటి సత్యవ్రతుడు కూడా. ఆయనకు ఒక నియమం ఉంది. ఆడవారితోను, ఆడంగి లేకివారితోను ఆయన పోరాడడు. అంతేగాక, భీష్ముడు ఒక మాట ఖండితంగా చెప్పాడు - తాను శిఖండితో యుద్ధం చేయనని. కానీ, శిఖండి భీష్ముడి మీద బాణప్రయోగం చేయటానికి వెనుకాడడు. అందువల్ల, ఏమఱుపాటు తగదు.
ఏమఱుపాటుతో ఉంటే, మృగాలకు రాజైన సింహాన్ని నక్క కూడా చంపుతుంది. యుద్ధంలో జాగ్రత్తగా కాచుకుని ఉండకపోతే, శిఖండి చేతిలో భీష్ముడిని కోల్పోతాము. అప్పుడది, పెద్దపులి ఆదమరిచి నిద్ర పోతూ ఉంటే, కూడగట్టుకున్న బలంతో గొఱ్ఱె, దానిని చంపినట్లుగా ఉండదా? "
అందువల్ల, ఏమఱుపాటు, అజాగ్రత్త కూడవని దుర్యోధనుడు తన తమ్ముడు దుశ్శాసనుడిని హెచ్చరిస్తున్నాడు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, భీష్మపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment