అకుటిలు, డార్యసమ్మతు, డహంకృతి దూరుడు, నీతి నిర్మలా
త్మకు డనవద్య శీలుడు, సధర్ముడు, దాంతుడు, గొంతిముద్దుసే
యు కొడుకు, మేను లేత, దన యుల్లము మెత్తన, యిట్టి యీత డె
ట్లొకొ యొరు నాశ్రయించు? విధి యోపదె యెవ్వరి నెట్లు సేయగన్!
ఈ పద్యంలో సహదేవుని గుణాలన్నీ పేర్కొనబడ్డాయి.
సహదేవుడు కపటత్వం లేనివాడు, పెద్దలకు ప్రీతిపాత్రమయిన వాడు, అహంకారం లేనివాడు, నీతి తప్పని వాడు, స్వచ్ఛమైన మనస్సు కలవాడు, ఏ మాత్రం వేలెత్తి చూపడానికి వీలు లేని శీలం కలవాడు, ధర్మం తప్పని వాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కుంతీదేవి గారాబు బిడ్డ, సుకుమారుడు, మెత్తని మనస్సు కలవాడు. ఇన్ని మంచి గుణాలున్న తన తమ్ముడు ఇతరుల పంచలో యెట్లా అజ్ఞాతంగా గడపగలడని, విధి వైపరీత్యానికి చింతిస్తున్నాడు ధర్మరాజు.
ఏ ఇంట్లో అయినా సంతానంలో చివరివాడిని గారాబంగా చూడటం సహజం. కుంతి గారాబు బిడ్డ కష్టాల పాలవుతున్నాడనేది ధర్మరాజుని యెక్కువగా బాధిస్తున్నది.
సహదేవుని వ్యక్తిత్వాన్ని పట్టి ఇచ్చే యీ పద్యం తిక్కన భారతము, విరాటపర్వము, ప్రథమాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment