ఒప్పెడు మేను బెంపు గల యుల్లము, నాగరికంపు జందముం
జెప్పక చూప కీతని విశేషము దెల్పెడు గొల్చుటెంతయున్
దెప్పర; మేమి సేయుదు గడింది విచారము పుట్టె; నె ట్లితం
డప్పురి సంచరించునొకొ; యన్యు లెఱుంగక యుండునట్లుగన్.
అశ్వినీదేవతల అంశతో పుట్టిన కవలులలో ఒకడు నకులుడు. చక్కని దేహసౌష్ఠవం కలవాడు. మంచి మనస్సు ఉంది. ఆకారవిశేషాలు నాగరికత కలవాడు అని చెప్పకనే చెబుతున్నాయి. అటువంటివాడు, విరాటరాజు కొలువులో యెట్లా అజ్ఞాతవాసం చేయగలడు? ఇతరులు గుర్తుపట్టకుండా యెట్లా తిరుగ గలడు? ఇదీ ధర్మరాజు విచారానికి కారణం.
నకులునిలో ఉన్న గొప్ప గుణాలే అజ్ఞాతవాసంలో ప్రతికూలంగా మారుతాయా అన్నదే ధర్మరాజుని బాధిస్తున్న విషయం. అంతేగాక, పరస్పర భిన్నమైన సుకుమార-సేవక లక్షణాలను చెప్పకనే చెప్పింది యీ పద్యం. నకులుడు సుకుమారి, మానసిక సౌందర్యం కలవాడు, పైగా నాగరికుడు. ఇక సేవకుడు, మొరటుగా, మాట కఠినంగా, అనాగరికంగా ఉంటాడు. ఈ భిన్నాంశాలను ఎంతో అందంగా స్పృశించింది యీ పద్యం. సహృదయులకు నకులుడి పాత్ర పట్ల సానుభూతిని కలిగించే తిక్కనగారి భావనాశిల్పము యిది అని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, విరాటపర్వము, ప్రథమాశ్వాసమునకు వ్యాఖ్యానము వ్రాసిన డా.సర్వోత్తమరావుగారు, సంపాదకవర్గం, వెలిబుచ్చిన అభిప్రాయం ఇక్కడ గమనార్హం.
No comments:
Post a Comment