ఊరక మీఱ నాడెదవు, యుక్త మయుక్తము నాత్మ జూడగా
నేరవు, సర్వలోకములు నీతిపరాక్రమంబు లొ
ప్పారగ నేలి ధర్మముల కన్నిటికిం గుదురై వెలుంగు ధా
త్రీరమణుండు మేటిగ నుతింపగ వోలదె నాకు నిమ్మెయిన్?
మార్కండేయ మహాముని ధర్మరాజుకు బ్రాహ్మణ క్షత్రియ స్వభావాలను గురించి చెబుతూ, అత్రి అనే బ్రాహ్మణుని కథ చెప్పాడు.
దానము అడగడానికి వైన్య మహారాజు వద్దకు వెళ్ళిన అత్రి అనే బ్రాహ్మణుడు, మహారాజుని బ్రహ్మ అని, ఇంద్రుడని పొగిడాడు. దానికి కోపం తెచ్చుకొన్న గౌతముడు అనే మహాముని, ధనం మీద ఆశతో ఒక మానవుడిని ఏ విధంగా పొగుడుతావని అత్రిని ప్రశ్నించాడు. దానికి అత్రి యీ విధంగా సమాధాన మిచ్చాడు.
" తగినదేదో తగనిదేదో విచారించకుండా, అధిక ప్రసంగం ఎందుకు చేస్తున్నావు? ప్రజలను పాలించేవాడు , రక్షించేవాడు రాజు. ధర్మం లోకంలో ప్రవర్తిల్లాలంటే, దానికి ప్రభువే కుదురు. అందువల్ల, అటువంటి ప్రభువుని పొగడటం సరియైన పనే కదా! "
ఇందులో రెండు భిన్నాంశాలు ఉన్నాయి. ధనాపేక్షతో, మానవమాత్రుడైన రాజుని ఇంద్రుడని, చంద్రుడని, సర్వ జగత్తుకు ఆధారభూతుడని పొగడటం నోరు అరిగి పోయేటట్లు వాగడం వంటిదని గౌతముని వాదన. దానికి భిన్నంగా, ప్రజాభ్యుదయాన్ని కాంక్షించి, ప్రజలను రక్షించి, లోకాన్ని ధర్మ మార్గంలో నడిపించే రాజు, ఒక వ్యక్తి కాదని, పటిష్టమైన సంఘ నిర్మాణకర్త అని, అందువల్ల అటువంటివాడిని బ్రహ్మ అన్నా, ఇంద్రుడన్నా, ఈశ్వరుడన్నా, అది అతనికిచ్చిన సమున్నత గౌరవమే కానీ, ఇతరం కాదని అత్రి వాదన. ఈ రెండు వాదనలు కూడా బలంగా ఉన్నాయి కనక, దీనిని విజ్ఞతతో, వివేకంతో పరిష్కరించాలి.
ఇక్కడ తిక్కనగారు, రాజుకు పర్యాయపదంగా, ' ధాత్రీరమణుండు ' అని వాడటం గమనార్హం. భూమిని సంతసింపజేసే భర్త ధాత్రీరమణుడు.
ఈ అత్రి గౌతముల సంవాదం శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వము, చతుర్థాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment