భానునిభుండు పాండుజనపాలుడు ఘోరతపంబు చేసి ధ
ర్మానిలవాసాశ్వినుల దైవవరంబున శక్తిపేర్మితో
నీ నరనాథనందనుల నేవుర వంశవివృద్ధి పొంటె బం
చాననసత్వులం బడసి నా శతశృంగమహానగంబునన్.
పాండురాజు ఆకస్మిక మరణం హస్తినాపురంలో అంతులేని దుఃఖాన్ని నింపింది. అతని వంశానికి వారసులైన పాడుపుత్రులను వారి పెద్దలకు అప్పచెప్పటం కోసం ధర్మబుద్ధితో ఋషులు కుంతిని, పాండుపుత్రులను వెంటబెట్టుకొని హస్తినాపురం వచ్చారు. వారిని చూడటానికి జనం విరగబడ్డారు.
ఆ ఋషులలో ఒక వృద్ధతపస్వి వారిని కురువృద్ధులకు పరిచయం చేస్తూ, " తేజస్సులో సూర్యునితో సమానుడైన పాండురాజు శతశృంగ పర్వతము మీద తీవ్రమైన తపస్సు చేసి యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీదేవతల వరంతో, వంశాభివృద్ధి కోసం, సింహబలులైన ఐదుగురు కొడుకులను కన్నాడు. " అని అన్నారు .
వృద్ధతపస్వి పాండురాజు కుమారులను పరిచయం చేయడం ఎంతో ఔచిత్యంతో కూడుకొని ఉంది. పెద్దవారు పరిచయం చేయడం యీ జాతి సంప్రదాయం. వృద్ధతపస్వి మాట్లాడిన ప్రతిమాట యెంతో అర్థవంతంగా, సార్థకంగా ఉంది. పాండురాజు శతశృంగ పర్వతము మీద కఠోరమైన తపస్సు చేయడం, అతని గుణగణాలను మునులు ప్రత్యక్షంగా చూసారు. అందువల్ల, కిమంద ముని శాపాన్ని దృష్టిలో పెట్టుకొని, దేవతల వర ప్రభావంతో, వంశాభివృద్ధి కోసం, పుత్రులను కన్నాడు. ఇదంతా మునులకు తెలుసు. అందువల్ల, వృద్ధతపస్వి చెప్పిన మాటలు సార్థకంగా ఉన్నాయి. దీనిని అర్థవ్యక్తి అనే గుణం అంటారని పెద్దలు చెప్పారు.
ఈ పద్యం ఎఱ్ఱన భారతం అరణ్యపర్వం పంచమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment