ప్రాయము కల్మి నొక్కటన భవ్యధృతిన్ మహనీయశీలతన్
సాయక సంపదం బటు భుజావిభవంబున గార్యతంత్ర శి
క్షాయుత బుద్ధి వృద్ధుడవు గావె? ధరాసురవర్య! మున్ను గాం
గేయుడు మాకు నెల్ల నెఱిగింపడె నీదు మహానుభావమున్.
శ్రీమదాంధ్ర మహాభారతము, ద్రోణపర్వము, ప్రథమాశ్వాసము నందలి యీ పద్యము సుయోధనుని రాజకీయ చతురతకు నిదర్శనము.
భీష్మపితామహుడు యుద్ధంలో పడిపోయిన తరువాత, కర్ణుడు సుయోధనుని దగ్గరకు వచ్చాడు. కుశలప్రశ్నానంతరం, సుయోధనుడు, సర్వసైన్యాధ్యక్షుడిగా యెవరిని చేయాలని అడిగాడు. సర్వసేనాధిపతిగా అన్ని విధాల ద్రోణాచార్యుడు తగినవాడని కర్ణుడు చెప్పాడు. అప్పుడు సుయోధనుడు ద్రోణాచార్యుడి వద్దకు వచ్చి వినయపూర్వకంగా ఇట్లా అన్నాడు.
" బ్రాహ్మణోత్తమా, ద్రోణాచార్యా! ఒక్క వయస్సులోనే కాదు, ధైర్యంలోను, గొప్ప శీలసంపదలోను, శస్త్రాస్త్ర నైపుణ్యంలోను, బాహుబలంలోను, కార్యదక్షతలోను నిన్ను మించిన వారున్నారా? మీ గొప్పతనాన్ని గురించి భీష్ముడు మాకు ఇదివరకే చెప్పాడు. "
అర్థరథుడని భీష్మునిచే కించపరచబడిన కర్ణుడు, భీష్ముడు యుద్ధరంగంలో ఉన్నంతవరకు, అక్కడకు రానని శపథం చేశాడు. భీష్ముడు, యుద్ధరంగంలో నుండి వైదొలగిన తరువాత, సహజంగానే సర్వసైన్యాధిపత్యం కర్ణుడు ఆశిస్తాడని సుయోధనునికి తెలుసు. కానీ, వయస్సులోను, శస్త్రాస్త్ర విద్యలోను విస్మరించరాని ద్రోణాచార్యుని ప్రక్కకు పెట్టి, కర్ణుని సర్వసేనాధిపతిగా చేస్తే, ద్రోణుడు నొచ్చుకుంటాడన్న తలపుతో, కర్ణుడిని పెద్ద చేసి, సేనాధిపతిత్వం యెవరికి ఇవ్వాలని అతడినే అడిగాడు సుయోధనుడు. ఇదీ రాజకీయ చతురత అంటే. సుయోధనుడు ఊహించినట్లే, ద్రోణాచార్యుడు ఆ గౌరవానికి అర్హుడని సూచించాడు కర్ణుడు.
No comments:
Post a Comment