సమ్మదమంది చూచిరి భృశంబుగ భూజను లెల్ల బ్రహ్మతే
జమ్మును రాజతేజమును సద్బహుభూషణ రత్నరాజి తే
జమ్మును విస్తరించుచు నిజద్యుతి యొప్పగ మూర్తమైన ధ
ర్మమ్మును బోలె నున్న గుణమండితు దీక్షితు ధర్మనందనున్.
భగవంతుడైన శ్రీకృష్ణుని దయతో, అరివీర భయంకరులైన తమ్ముల సహాయంతో, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. ఆయన బ్రహ్మతేజంతో, క్షాత్రతేజంతో వెలిగిపోతున్నాడు. అతడు ధరించిన రత్నాభరణాలు ఆ ప్రకాశానికి మెరుగులు దిద్దుతున్నాయి. వీటన్నిటికీ తోడు తన సహజమైన కాంతి, నిజద్యుతి, జతగలిసిందా అన్నట్లు, ఆకారం దాల్చిన ధర్మం వలె సుగుణ సంపదతో ప్తకాశిస్తూ, యజ్ఞదీక్షితుడై ఉన్న ధర్మరాజుని చూసి అక్కడ ఉన్నవారంతా సంతోషించారు.
ఈ పద్యంలో ఉన్న విశేష మేమంటే, వాల్మీకి మారీచుని చేత " రామో విగ్రహవాన్ ధర్మః " అని చెప్పించాడు. " అదే రీతిలో తెలుగు భారతంలో నన్నయగారు, కథానాయకుడు యుధిష్ఠురుని, " మూర్తమైన ధర్మము " , రూపుదాల్చిన ధర్మంగా అభివర్ణించారు .
కురుక్షేత్ర మహాసంగ్రామం ద్వారా, ధర్మ విజయాన్ని సూచించే మహేతిహాసం భారతం. అందుకే, నన్నయగారు, " ధర్మతత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రం బని " అన్నారని వ్రాశారు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, సభాపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment