శ్రీవత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారువక్షస్థల
శ్రీవిభ్రాజితు నీలవర్ణు శుభు రాజీవాక్షు గంజాత భూ
దేవేంద్రాది సమస్తదేవ మకుటోద్దీప్తోరు రత్నప్రభా
వ్యావిద్ధాంఘ్రిసరోజు నచ్యుతు గృపావాసుం బ్రశంసించెదన్.
ఈ పద్యం శ్రీమదాంధ్రమహాభాగవతము షష్ఠస్కంధము లోనిది. షష్ఠస్కంధము ఏర్చూరి సింగయ కవి తెనుగు చేశారు. అందువల్ల, మరల యిది ఇష్టదేవతా ప్రార్థనతో మొదలవుతుంది.
శ్రీవత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల శ్రీవిభ్రాజితున్ అన్నది ఒకే సమాసం. ఇందులో ఉన్నవన్నీ శ్రీమహావిష్ణువుకి గుర్తులు. శ్రీవత్సమనే పుట్టుమచ్చ, కౌస్తుభమనే మణి, వక్షస్థలంలో నున్న లక్ష్మీదేవి. విటన్నింటితో ఆయన విరాజిల్లుతున్నాడు. అంతేగాక, ఆయన నల్లని దేహం కలవాడు, శుభాన్ని కలిగించేవాడు, పద్మాల వంటి కనులు కలవాడు. కంజాత భూదేవేంద్రాది సమస్తదేవ మకుటోద్దీప్తోరు రత్నప్రభా వ్యావిద్ధాంఘ్రిసరోజుడు. ఆయన నాభికమలంలో నుండి పుట్టిన బ్రహ్మ, దేవేంద్రుడు మొదలైన వారి కిరీటములందలి రత్నముల కాంతిచే ప్రకాశిస్తున్న పాదపద్మములు కలిగినవాడు. ఆయన అచ్యుతుడు. నాశము లేనివాడు. కృపావాసుడు. దయకు నివాసం అయినవాడు. అటువంటి శ్రీహరికి నేను నమస్కరిస్తున్నాను. ఇదీ పద్యభావం.
మొదటి పాదంలోను, మూడవ పాదంలోను దీర్ఘ సంస్కృత సమాసాలు వాడటం వల్ల, ఆయన దేవదేవుడని పఠితల మనస్సులకు ధ్వనిస్తుంది.
No comments:
Post a Comment