గృహ సమ్మార్జనమో, జలాహరణమో, శృంగార పల్యంకికా
వహనంబో, వనమాలికా కరణమో, వాల్లభ్యలభ్యధ్వజ
గ్రహణంబో, వ్యజనాత పాత్రధృతియో, ప్రాగ్దీపికారోపమో,
నృహరీ! వాదమ నాకు? లేరె యితరు ల్నీలీలకుం బాత్రముల్.
మధురలో నున్న పాండ్యరాజు సభకు వెళ్ళి, అక్కడి పండితులను మత చర్చలో ఓడించి, శ్రీవైష్ణవ మతస్థాపన చేయమని విష్ణుచిత్తుణ్ణి ఆదేశించాడు కలలో దర్శన మిచ్చిన శ్రీమహావిష్ణువు. శాస్త్రగ్రంథాలు తానేమీ చదువలేదని, అందువల్ల శాస్త్రచర్చలో తాను ఓడిపోతే, అది శ్రీమహావిష్ణువుకు అపకీర్తి తెస్తుందని విష్ణుచిత్తుడు మొరబెట్టుకున్నాడు.
అంతేగాక, ఆలయాన్ని శుభ్రం చేయడమో, గుడి అవసరాల కోసం నీళ్ళు మోయడమో, ఊరేగింపు పల్లకి మోయడమో, పూలదండలను కట్టడమో, స్వామి జండా పట్టుకొనడమో, విసనకర్రను, గొడుగును పట్టుకొనడమో, కాగడాలను వెలిగించడమో వంటి పనులను చేసే తనను పాండ్యరాజు సభలో వాదిగా పంపవద్దని, భగవంతుని ఆటకు పాత్రులు తాను తప్ప ఇక ఇతరులు లేరా అని మహావిష్ణువును విష్ణుచిత్తుడు బ్రతిమాలుకున్నాడు.
ఈ పద్యంలో చెప్పిన పనులన్నీ స్వామి కైంకర్యాలు అంటారు. ఇవి వైష్ణవాలయాల్లో సర్వ సాధారణం. అందువల్ల, వైష్ణవమతస్థుడైన శ్రీకృష్ణదేవరాయలు వానిని సవివరంగా పేర్కొనడం జరిగింది.
ఇంత సొగసైన పద్యం శ్రీకృష్ణదేవరాయలవారి ఆముక్తమాల్యద ద్వితీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment