చెలియల్ కన్నియ ముద్దరా లబల నీ సేమంబె చింతించు ని
ర్మల దీనిన్ బయలాడుమాటలకు నై మర్యాద బోదట్టి, స
త్కుల జాతుండవు పుణ్యమూర్తి వకటా! కోపంబు పాపంబు నె
చ్చెలి నోహో! తెగవ్రేయ బాడియగునే? చింతింపు భోజేశ్వరా!
చెల్లెలిని వధించటానికి పూనుకొన్న బావ కంసుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు వసుదేవుడు.
" బావా! నీ చెల్లెలు వట్టి అమాయకురాలయ్యా! ఆమె అబల. ఎప్పుడూ నీ క్షేమాన్నే కోరుకునే పవిత్ర హృదయురాలు. ఏదో బయట వినపడ్డ మాటలు విని, వంశమర్యాద ప్రక్కనబెట్టి, పేరుపొందిన భోజవంశంలో పుట్టిన నీ వంటి పుణ్యవర్తనుడు, కోపంతో ఇంతటి పాపానికి ఒడిగట్టడం న్యాయమా? నీకు ప్రియమైన సోదరిని చంపడం ధర్మమా? అది నీ ప్రతిష్ఠకు భంగం కాదా! ఒకసారి నిదానంగా ఆలోచించు. "
పుణ్యమూర్తివి అనడంలో ఇంత పాపకార్యాన్ని ఎట్లా తలపెట్టావు అనే ఆక్రోశంతో కూడిన, ఎత్తిపొడుపు ఉంది.
శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమస్కంధము లోనిది యీ పద్యం.
No comments:
Post a Comment