ప్రాంశు బయోదనీలతనుభాసితు, నుజ్జ్వల దండధారు, బిం
గాంశు, జటాచ్ఛటాభరణు, నాగమపుంజపదార్థతత్త్వ ని,
స్సంశయకారు, గృష్ణమృగచర్మకృతాంబరకృత్యు భారతీ
వంశవివర్థనుం ద్రిదశవందితు సాత్యవతేయు గొల్చెదన్.
శ్రీమదాంధ్ర మహాభారతము, భీష్మపర్వము, ప్రథమాశ్వాసముళోని యీ పద్యము రాని సాహిత్యాభిలాషి గాని, ఒకవేళ తెలియకపోయినా, చదివిన తరువాత, విన్న తరువాత, ఆ పద్యం యొక్క మాధుర్యానికి, నడక వేగానికి ముగ్ధుడు కానివాడు గానీ ఉండడని అనిపిస్తుంది.
భీష్ముడు యుద్ధరంగంలో పడిపోయిన సంగతి సంజయుడు చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు మూర్ఛపోయాడు. మూర్ఛ నుండి తేరుకొన్న తరువాత, భీష్ముడు చేసిన యుద్ధాన్ని గురించి సవిస్తరంగా చెప్పమని సంజయుణ్ణి అడిగాడు. సంజయుడు, అంతా వివరించే ముందు చేసిన వ్యాసభగవానుని గూర్చి స్తుతి యిది.
వ్యాసమహర్షి ఉన్నతుడు. నీలమేఘం వంటి దేహచ్ఛాయతో వెలుగొందేవాడు. ప్రకాశించే దండం ధరించేవాడు. గోరోజనం రంగు గల జడలను ఆభరణంగా కలవాడు. వేదసముదాయాన్ని సంశయం లేకుండా విప్పి, వాని తత్త్వాన్ని నిరూపించినవాడు. జింకచర్మాన్ని వస్త్రంగా ధరించిన వాడు. భరత వంశాన్ని వృద్ధి చేసినవాడు. దేవతలచే నమస్కరింపబడినవాడు. అటువంటి సత్యవతి కుమారునికి మ్రొక్కుతున్నాను అని పద్యానికి అర్థం.
తిక్కనకు వేదవ్యాసమహర్షి పై గల భక్తిభావానికి యీ పద్యం ఒక చక్కని ఉదాహరణ.
No comments:
Post a Comment