ఇరు ప్రక్కియల నుండి సురసింధురములు
పరిపూర్ణ హేమకుంభములు దాల్ప
నందంద నవనిధానాధిదేవతలును
సొరిది బంగారువీచోపు లిడగ
జయ జయ ధ్వనులతో సర్వదేవతలును
గేలుదమ్ములు మౌళి గీలుగొల్ప
బుష్పవర్షములకు బ్రోదియై వినువీధి
దేవదుందుభినాద మావహిల్ల
బ్రబలి మున్నీటినడునీట బాండువికచ
కమలకాంచనకర్ణికాగ్రంబునందు
బ్రహ్మదిక్పాలవందితపాదపద్మ
పద్మ యుదయించె గన్నులపండు వగుచు.
పాలకడలిని చిలుకుతుంటే ముందు హాలాహలం పుట్టింది. దానిని, శివుడు తన కంఠంలో దాచి లోకాలను రక్షించాడు. ఆ తరువాత, క్షీరసాగరమధ్యం నుండి ఒక పద్మము పుట్టింది. దాని పరిమళంతో లోకాలన్నీ నిండిపోయాయి.
ఆ అష్టదళ పద్మము నందు " పద్మ యుదయించె కన్నులపండు వగుచు. " అన్నాడు శ్రీనాథుడు. అట్టి లక్ష్మీదేవిని వర్ణించే పద్యమే ఇది.
" లక్ష్మీదేవికి రెండు ప్రక్కల ఐరావతముల వంటి స్వర్గ లోకపు గజరాజులు స్వర్ణకుంభాలను తొండములతో పైకెత్తి పట్టుకున్నాయి. నవనిధులకు అధిదేవతలు బంగారపు వింజామరలు వీస్తున్నారు. జయ జయ ధ్వానాలతో, దేవతలందరూ తలలు వాల్చి ఆమె పాదపద్మాలకు నమస్కరిస్తున్నారు. ఆకాశవీధి నుండి పూలవానతో పాటు దేవదుందుభులు మ్రోగసాగాయి. ఈ విధంగా పాలసముద్రం నడుమ, బంగారు కాంతులు విరజిమ్ముతున్న వికసించిన పద్మము నందు చూసేవారి కన్నులకు పండుగగా, బ్రహ్మాదిదేవతలచే పూజింపబడుతున్న, లక్ష్మీదేవి ఉద్భవించింది. "
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం.............హస్తినాద ప్రబోధినీం........పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. " అని ఋగ్వేదాంతర్గత శ్రీసూక్తం లక్ష్మీదేవిని కీర్తిస్తుంది.
శ్రీనాథ కవిసార్వభౌముడు యీ పద్యంలో పద్మము యొక్క ప్రస్తావన పలుసార్లు చేశాడు. పద్మం, స్వచ్ఛతకు, పవిత్రతకు, అందానికి, ఆధ్యాత్మికతకు, ప్రాణశక్తికి సంకేతం. లక్ష్మీదేవికి ఇరుప్రక్కల నున్న ఏనుగులు, సంపదకు, సమృద్ధికి చిహ్నాలు.
మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కచ్ఛపము, ముకుందము, కుందము, నీలము, ఖర్వము అన్న తొమ్మిది నిధులను కుబేరుని నవనిధులు అంటారు. అటువంటి కుబేరుడు అమ్మవారికి బంగారపు వింజామరతో వీస్తాడు. అనగా, లక్ష్మీ కటాక్షం ఉంటే సంపదలు సమకూరుతాయని అర్థం.
ఈ సీస పద్యం హరవిలాసము, షష్ఠాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment