' వినుతచరిత్రు డత్రి యను విప్రవరుండు తపం బొనర్ప గా
వనమున కేగుచుండి తన నాతి గొనుంగొని యిట్లనుం " దపం
బున కిదె యేను బూని వనభూమికి బోవుచు నున్నవాడ, నో
వనరుహనేత్ర! నీవు నట వచ్చెదొ పుత్రుల యొద్ద నుండెదో. '
అనుటయు భార్య యిట్లనియె ' నక్కట! పుత్రులకుం గుటుంబభా
ర నియమవృత్తు లెల్లను దిరంబుగ జేయక యాశ్రమాంతరం
బునకు మహాత్మ! నీకు నిటు వోవుట ధర్మువు గాదు; వైన్యభూ
జనపతి యిచ్చు నర్థులకు జాలగ; నర్థము వేడు మవ్విభున్. '
శ్రీమదాంధ్ర మహాభారతము అరణ్యపర్వము చతుర్థాశ్వాసంలో ఎఱ్ఱన రెండు పద్యాలలో సనాతన భారతీయ సంప్రదాయము నందున్న నాలుగు ఆశ్రమాల యొక్క సమతుల్యతను పాటించడమనే సున్నితాంశాన్ని, భార్యాభర్తల మధ్య సంభాషణ రూపంలో చక్కగా తెలిపరచారు.
అత్రి ఆనే బ్రాహ్మణుడు తపస్సు చేసుకొనడానికి వనభూమికి వెళ్ళదలచుకొన్నాడు. అదే విషయం భార్యకు చెప్పి, ఆమె తనతో వచ్చినా, లేదా, కొడుకుల వద్ద నున్నా అంగీకారమే నని చెప్పాడు. అది విన్న, అతని భార్య, కొడుకులకు కుటుంబాన్ని నిర్వహించవలసిన విధానాలను, కట్టుబాట్లను వివరించకుండా, కుటుంబ బాధ్యతలను అప్పగించకుండా, తపస్సు చేసుకొనడానికి అడవులకు వెళ్తాననడం భావ్యమా, అని ప్రశ్నించింది. అంతటితో ఆగక, సహధర్మచారిణిగా కర్తవ్యాన్ని కూడా సూచించింది. వైన్య మహారాజు గొప్ప దాత గనుక, అతనిని అర్థించి కుటుంబపోషణకు కావలసిన ధనాన్ని తీసుకు రావసిందిగా సలహా ఇచ్చింది.
సనాతన భారతీయ సంప్రదాయములో, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనే నాల్గు దశ లున్నాయి. బ్రహ్మచర్యము విద్యార్థి దశ. గార్హస్థ్యము, వివాహం చేసుకొని, సత్సంతానాన్ని పొంది, కుటుంబ బాధ్యతలను నిర్వహించవలసిన దశ. కుటుంబ బాధ్యతలను నిర్వహించి, తరువాత తరానికి అప్పగించిన తరువాత చేపట్టవలసిన దశ వానప్రస్థము. వానప్రస్థాన్ని భార్యతో కలిసి ఆచరింపవచ్చని మన ప్రాచీన ఋషులు చెప్పారు. అందువల్లనే, అత్రి, భార్యకు ఎక్కడ ఉండాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ, కుటుంబ బాధ్యతలు తీరకుండా, తప్పించుకొని, ముక్కు మూసుకుని తపస్సు చేసుకొనాలనుకొనడం ధర్మం కాదని, అవివేకమని అత్రి భార్య భావించింది. అదే విషయాన్ని భర్తకు చెప్పింది. ' మహాత్మ ' అన్న సంబోధన ఆమెకు భర్తపై గౌరవం తగ్గలేదని తెలియజేస్తుంది. అందువల్లనే, మన సనాతన భారతీయ సంప్రదాయములో భార్యను " కరణేషు మంత్రి " అని వర్ణించింది.
మహాభారతము నందలి జరత్కారువు కథ గృహస్థాశ్రమ ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. దీనినే మన పెద్దవారు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలి అని మూడు ముక్కల్లో చెప్పారు.
No comments:
Post a Comment