తెలతెలవార నొయ్య నరుదెంచి నితాంత రతాంతతాంతలౌ
చెలువల కింపుగా మెలగి చెక్కులగూరిన చూర్ణకుంతలా
వళి సరళంబుగా జడిసి వాడిన సజ్జల మీది ప్రావిరుల్
దొలగ బ్రభాత వాయువులు దోచు బురిం బరిచారికాకృతిన్.
ఇది ప్రభాతవాయువుల వర్ణన. పొద్దునపూట వీచే సన్నని గాలి చల్లగా శరీరాన్ని తాకుతూ బడలిక తీరుస్తుంది. ఎండకాలంలో ఉక్కతో చచ్చిపోయే ప్రాణులకు ఇది బాగా తెలుసు. ఈ అనుభవాన్ని దాంపత్య జీవితంలోని శృంగారానికి జోడిస్తూ ఎంతో అందంగా వ్రాసాడు తెనాలి రామకృష్ణ కవి యీ పద్యాన్ని.
తెల్లారగట్లనే వచ్చిందట చల్లని గాలి. వచ్చి, రాత్రంతా రతిక్రీడతో అలసిపోయిన (నితాంత రతాంతతాంతలు) స్త్రీల చెక్కిళ్ళపై వ్రాలిందట. వ్రాలి, చెదరిన ముంగురులను (చూర్ణకుంతలావళి) మెల్లగా (సరళంబుగా) మీదికి త్రోసిందట (జడిసి). త్రోసి, పడకల మీది (సజ్జల మీది) వాడిపోయిన పూలను (ప్రావిరుల్) తొలగదోసిందట. పరిచారికాకృతిన్. పరిచారిక లాగా.
ఎంత అందమైన పద్యం!
భట్టుమూర్తి కూడా వసంతకాలపు శోభను " అతికాంత సలతాంత లతికాంతర నితాంత రతికాంతరణకాంత సుతనుకాంతము" అని, తట్టుకోలేక పెద్ద సీసపద్యమే వ్రాసాడు.
వర్ణనలనగానే ప్రబంథకవుల వ్యవహారమే అది.
ఇంత అందమైన పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము, ప్రథమాశ్వాసము లోనిది.
No comments:
Post a Comment