అబ్ధితో గూడ మునుగ్రోల నౌర్వవహ్ని
యుదరబిలమున నొకచోట యుండియుండి
జటిలవరునకు గద్రూజకటకకటక
విరహితాప మిషంబున వెడలెనపుడు.
తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము ప్రథమాశ్వాసం లోని ఈ చిన్న పద్యం మహాకవి చిత్రమైన ఊహకు అద్దం పడుతుంది.
అగస్త్యుడు సప్తఋషులలో ఒకడు. పొట్టివాడయినా గట్టివాడని పేరు తెచ్చుకొన్నవాడు. దానికి లోకకళ్యాణార్థం ఆయన చేసిన పనులే కారణం. అగస్త్యుడనగానే మనకు గుర్తొచ్చేవి మూడు సంగతులు. ఆయన కుండలో పుట్టాడని. బహుశా అందుకేనేమో, ఆయనను పొట్టివాడిగా, పెద్ద పొట్ట ఉన్నవానిగా వర్ణిస్తుంటారు. ఇక రెండవది, సముద్రజలాన్ని ఒక్క గుక్కలో త్రాగేయటం. మూడవది, మన అమ్ముమ్మలు, నాయనమ్మలు, అమ్మలు, పిల్లలకు అన్నం పెట్టిన తరువాత చెప్పే " జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం " అనే దానికి వెనుక నున్న వాతాపి ఇల్వలుల కథ.
ఈ పద్యంలో ఉన్నది, ఒక్క గుక్కలో సముద్రాన్ని తాగేశాడన్న అంశం నుంచి పుట్టిన చిత్రమైన ఊహ.
అగస్త్యుడు సముద్రజలాన్ని త్రాగినప్పుడు, సముద్రము లోని బడబాగ్ని అతని పొట్టలో ఒక మూల ఉండిపోయిందట. అగస్త్యుడు కాశీ క్షేత్రాన్ని వదలిపెట్టవలసి వచ్చినపుడు, ఆయనకు తాపం ఎక్కువయింది. తాపం ఎక్కువవటానికి హేతువుగా, బడబాగ్ని బయటకు వచ్చిందట. అందుకే అన్నారు విశ్వనాథ - ' మదికి నుదాత్త కల్పనల మక్కువ కలిగిన ' అని. అవును ఉదాత్త కల్పనలకు స్పందించే మనస్సు ఉండాలి కదా!
ఇంకా చూడండి. కాశీ క్షేత్రం 'కద్రూజకటకకటకము ' అంటున్నాడు.
కద్రువ సంతానం సర్పాలు. సర్పభూషణాంగుడు శివుడు. శివుని ఆవాసం కాశీ క్షేత్రం. కటకమంటే కంకణము, నివాసము.
తెనాలివానికి అందరికన్నా భిన్నంగా చెప్పడం, చెప్పి మెప్పించడం, ఒక సరదా.
No comments:
Post a Comment