వేనుడు మాధవుం దెగడి విప్రులు దిట్టిన భగ్నుడై తమో
లీనుడు గాడె తొల్లి; మదలిప్తుడు చైద్యుడు పిన్ననాట నుం
డేనియు మాధవున్ విన సహింపడు భక్తి వహింప డట్టి వా
డే నిబిడ ప్రభావమున నీ పరమేశ్వరునందు జొచ్చెనో?
శిశుపాలుడు కృష్ణద్వేషి. ఆ మహామహునిచే వధింపబడి, విష్ణుతేజంలో లీనమయ్యాడు. ఈ సన్నివేశమే పరీక్షిత్తుని ప్రశ్నకు కారణభూతమయింది.
వేనుడు పృథుచక్రవర్తి తండ్రి అంగుని కుమారుడు. వేద, బ్రాహ్మణ విరోధి. విష్ణుమూర్తిని ద్వేషించాడు. అందుకని బ్రాహ్మణులు ఆయనను శపించారు. వేనుడు తమస్సులో మునిగిపోయాడు, నరకంలో పడిపోయాడు. అదేవిధంగా, మదగర్వంతో పేట్రేగిపోయిన చేదిదేశపు రాజు, శిశుపాలునికి చిన్నప్పటినుంచీ, కృష్ణుడి పొడ గిట్టదు. పరమాత్ముడైన ఆయన మీద భక్తిభావం ఎలాగూ లేదు. అటువంటివాడు, ఏ మహామహిమతో భగవంతునిలో ఐక్యమయ్యాడు. ఇదే, పరమ భక్తాగ్రేసరుడు, ధర్మమూర్తి అయిన పరీక్షిత్తు మనస్సును వేధిస్తున్న ప్రశ్న. భాగవతాన్ని వినిపిస్తున్న శుకమహర్షిని యీ విషయాన్ని అడిగాడు.
వేనుని గూర్చి తెలుసుకోవాలంటే, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి " వేనరాజు " నాటకం చదువవలసిందిగా మనవి.
No comments:
Post a Comment