పగలును రేయు గుడ్చి జలపానము లోనుగ గుడ్చునప్డు తు
ష్టిగ నొనరించి మర్త్యు డొకటిన్ నడుమ మఱి యెప్డు నంటకే
మిగతిని బాపముం బొరయమిం దలకొల్పుచు హోమకార్యముం
దగుమెయి జేయుచున్న విను తంగెటి జున్నగు నూర్థ్వలోకముల్.
శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనికపర్వం, చతుర్థాశ్వాసంలో భీష్ముడు ధర్మరాజుకి వినిపించిన ధర్మసూక్ష్మాలు కనిపిస్తాయి. అటువంటిదే, ఇప్పటి మానవ సమాజానికి పనికివచ్చే, మానవ సమాజం చేయగలిగిన ఉపవాసవ్రత విధానం.
ముందుగా భీష్ముడు ధర్మరాజుకి యజ్ఞం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాడు. అయితే, యజ్ఞం చేయడమనేది, అర్థబలం, అంగబలం ఉన్నవారికే సాధ్యమని, సామాన్యుల సంగతేమిటని ధర్మరాజు ప్రశ్నించినపుడు, అంగిరసుడు తనకు చెప్పిన యీ ఉపవాస నియమాన్ని వివరించాడు.
" పగలు ఒక పూట, రాత్రి ఒక పూట, అంటే, రెండు పూటలు భోజనం చేస్తూ, భోజనం చేస్తున్నప్పుడు మధలో నీళ్ళు త్రాగుతూ యీ ఉపవాస నియమాన్ని పాటించాలి. ఈ మధ్యకాలంలో ఇంకేమీ తినకూడదు. ఏ పాపకార్యం చేయకుండా హోమవిధిని నిర్వర్తిస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే, పుణ్యలోకాలు తంగేటి జున్ను లాగా అందుతాయి. "
తంగేటి చెట్టు మీది తేనెపట్టు చాలా సులభంగా దొరుకుతుంది. పైన చెప్పిన నియమాలను పాటించిన వారికి ఉత్తమగతులు కూడా అంతే తేలికగా కలుగుతాయి.
దుర్బలులు, అలసులు, మందబుద్ధులయిన కలియుగం లోని మానవులకు ఎంతో కరుణార్ద్ర హృదయంతో వ్యాసభగవానుడు యీ నియమాన్ని నిర్దేశించాడు.
No comments:
Post a Comment