గోత్రమహామహీధర నికుంజములన్ విపినంబులం గురు
క్షేత్రమునం బ్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వసేనుడై
ధాత్రి బరిభ్రమించు బలదర్ప బరాక్రమ దక్షు డీక్షణ
శ్రోత్రవిభుండు తక్షకుడు శూరుడు మాకు బ్రసన్ను డయ్యెడున్.
గోత్రమహామహీధరములు అంటే కులపర్వతాలు. ఇటువంటి కులపర్వతాల పొదల్లో, అడవుల్లో, కురుక్షేత్రంలో తిరుగుతుంటాడట తక్షకుడు. కొండలు, గుట్టలు, అడవులు, శ్మశానాల్లో (కురుక్షేత్రం) తిరిగేవాళ్ళు దొంగలు, దారిదోపిడీగాండ్రు. ఎట్లా తిరుగుతుంటాడు? " ప్రకామగతి ఖేలన నొప్పి " - ఎవరూ గుర్తుపట్టకుండా మారువేషంలో తిరుగుతుంటాడు. ఎవరితో పాటు తిరుగుతుంటాడు? సహాశ్వసేనుడై - తాను చాలడన్నట్లు తన కొడుకు అశ్వసేనుడిని వెంటబెట్టుకొని తిరుగుతుంటాడు. ఎక్కడెక్కడ తిరుగుతుంటాడు? ధాత్రి పరిభ్రమించుచున్ - ఒక్క చోట ఉండడు. ఎక్కడ గిట్టుబాటయితే అక్కడ తిరుగుతాడు. ఎటువంటివాడు? శూరుడు - ఆహా! ఇతని బలం, దర్పం, శౌర్యం ఏమని చెప్పాలి . సజ్జనుల మీద, బలహీనుల మీద చూపిస్తాడు. దొంగచాటుగా అన్నీ విని, ఎవరూ చూడకుండా దొంగతనం చేస్తాడు. " ఈక్షణ శ్రోత్ర విభుండు " - కన్నులే చెవులుగా గల పాముల రాజు. లోకంలో, " వాడివి పాము చెవులురా " అంటాము. అంటే, అన్నీ వినపడతాయి. ఇవన్నీ చెప్పి, " మాకు ప్రసన్న డయ్యెడున్ " అంటున్నాడు.
ఇదే ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో తెలియడమంటే. ఆదిశేషుడిని, వాసుకిని, ఐరావతుడిని స్తుతించిన తీరుకి ఇది భిన్నం. ఇందులో ఇతడు మహాదుష్టుడనే వ్యంగ్యధ్వని సౌరభం ఉంది. ఆ సౌరభాన్ని గుబాళింపజేసేదే చివర చెప్పిన " మాకు ప్రసన్న డయ్యెడున్ " అన్నది.
ఇన్ని అంశాలు కలపోతగా, ఉదంకుని నాగప్రముఖుల స్తుతి, ఉదంకోపాఖ్యానాన్ని దీప్తిమంతం చేస్తుంది. నన్నయగారి ప్రసన్న కథాకలితార్థయుక్తికి ఇది చక్కని ఉదాహరణ.
No comments:
Post a Comment