అనలము దోచునే తరువునందు గుఠారముఖంబులైన సా
ధనముల ద్రెవ్వ? సజ్జనహితా! తగ ద్రచ్చిన గాక; యట్ల యి
త్తనువు నలంగ జేసి పరతత్త్వము గాంతు మనంగ రాదు; వి
న్ననువున నాగమోక్తమధనం బొనరించినగాని యారయన్.
శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వం చతుర్థాశ్వాసంలో మను బృహస్పతి సంవాదం కనిపిస్తుంది. మనువు తన గురువైన బృహస్పతిని, జ్ఞానయోగాన్ని, జ్ఞానం ద్వారా ముక్తిని పొందే మార్గాన్ని తెలుపమని అడిగాడు. బృహస్పతి చెబుతున్నాడు.
" మంచివారికి హితాన్ని కలుగజేసే ఓ మనూ! చెట్టులో (కట్టెలో) నిప్పు కనపడకుండా దాగి ఉన్నట్లు, ఈ శరీరంలో పరతత్త్వం దాగి ఉంటుంది. కట్టెను కట్టెతో రాపిడి చేస్తే నిప్పు పుడుతుంది గాని, చెట్టును గొడ్డలితో నరికితేను, పెకలిస్తేను, వస్తుందా? అట్లాగే, ఒక పద్ధతి ప్రకారం పరతత్త్వాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయాలి గాని, ఇష్టమొచ్చిన రీతిలో చేస్తే ప్రయోజనం లేదు. అందువల్ల, శరీరంలో దాగి ఉన్న పరతత్త్వాన్ని లోపల తరచి చూసి తెలుసుకోవాలి గాని, దానిని హింసించి, బాధలకు గురిచేసి, గ్రహించలేము. "
పద్యంలో ' మథనం ' అనే శబ్దప్రయోగం జరిగింది. మథనం అంటె, త్రచ్చడం, చిలకడం. ఎక్కడ చిలకాలి? శరీరం లోపల, అంటే, మనస్సులో, హృదయంలో, మథనం జరగాలి. దీన్ని ' అంతర్మథనం ' అంటారు. దీనినే, వేదంతపరంగా, " నిన్ను నీవు తెలుసుకో " అని అంటుంటారు. ఇదే, " నేను అంటే శరీరం కాదని, శరీరం లోపల దాగి ఉన్న ' నేను ' అనే ప్రజ్ఞ " అనే ఎరుక. అయితే, ఈ ఎరుక ఒక్క రోజులో వచ్చేది కాదు. లోచూపు కలిగి, లోపల తరచి చూడాలి. అంతర్మథనం జరగాలి. దీనినే ప్రహ్లాదుడు " వెదకి చూసిన " అన్నాడు. ప్రయత్నం చేసి చూడాలి, చూసే ప్రయత్నం చేయాలి. అంటే ఏమయింది? సాధన చేయాలి. అప్పుడే, పరతత్త్వం తెలుస్తుంది.
No comments:
Post a Comment