నరవర! తొంటిభూపతుల నామ గుణంబులు, వృత్త చిహ్నముల్,
సిరియును, రూప సంపదలు, జెన్నగు రాజ్యము, లాత్మవిత్తముల్,
వరుస నడంగె గాని, యట వారల కీర్తులు నిర్మలంబులై
యురవడి భూమిలో నిలిచి యున్నవి నేడును రాజశేఖరా!
శుకమహర్షి పరీక్షిన్మహారాజుకి కలియుగం లక్షణాలు, పూర్వ రాజుల చరిత్రను వివరించాడు.
" పూర్వ రాజుల పేరు ప్రతిష్ఠలు, వారు నడుచుకొన్న తీరు, సంపదలు, అందచందాలు, చక్కని రాజ్యం, ఆధ్యాత్మిక ప్రగతి - ఇవన్నీ కాలంలో కరగిపోయినాయి గాని, వారి యశస్సు మాత్రం స్వచ్ఛంగా యీ భూమి మీద ఇప్పటికీ నిలిచి ఉన్నాయి కదా! "
చరిత్రలో, ఎన్నో రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఎందరో రాజులు ఈ భూమిని పాలించారు. అంతులేని సిరి సంపదలను కూడబెట్టారు. కొందరు ప్రజారంజకులనిపించుకున్నారు, కొందరు ప్రజాకంటకులనిపించుకున్నారు. అందరూ కాలగతిలో కలిసిపోయారు. కానీ, శాశ్వతంగా నిలిచింది మాత్రం ధర్మమార్గాన భూమిని పాలించినటువంటివారి కీర్తి మాత్రమే. ఈ సత్యాన్ని శుకమహర్షి పునరుద్ఘాటించాడు.
పోతనగారి ప్రియశిష్యుడు వెలిగందల నారయ పూరించిన శ్రీమదాంధ్ర మహాభాగవతము, ద్వాదశ స్కంధము లోనిది యీ పద్యం.
No comments:
Post a Comment