పొడిదగ్గు కంఠంబు బొరిపుచ్చకయమున్న
తల ప్రకంపంబు బొందకయమున్న
బొమలు కన్నుల మీద బొదివి వ్రాలకమున్న
పర నేత్రముల కడ్డుపడకమున్న
శ్రుతిపుటంబుల శక్తి సురిగి పోవకమున్న
వళు లాననమున బర్వకయమున్న
హృదయంబులో జాగ పదను దప్పకమున్న
గాత్రంబు శిథిలంబు గాకమున్న
పండ్లు వేర్వాసి కదలుచూపకయమున్న
కాళికడకంటి చూపు పై రాకమున్న
కాలుసేయాడు కాలంబె కదలవలయు
దీర్థసేవకు దేహ మస్థిరము గాన.
ఈ పద్యం శ్రీనాథ కవిసార్వభౌముని కాశీఖండము తృతీయాశ్వాసము లోని శివశర్మోపాఖ్యానము నందలిది.
మధురాపట్టణంలో ఉంటున్న శివశర్మ వేద వేదాంగాలను అభ్యసించాడు. ధనం సంపాదించి, పిల్లలకు పంచిపెట్టి, వయసు మీదపడుతుండటంతో, విచారానికి లోనయ్యాడు. శరీరంలో పటుత్వం తగ్గక ముందే, కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడే తిర్థయాత్రలను చేయాలనుకున్నాడు.
పైన చెప్పిన భావాన్ని పొందుపరచిన యీ సీసపద్యం బాగా ప్రసిద్ధి పొందిన ధూర్జటి మహాకవి యొక్క " దంతంబుల్పడనప్పుడే, తనువునందారూఢి యున్నప్పుడే " అనే పద్యాన్ని గుర్తుకు తెస్తుంది. పద్యం చాలా సులభంగా అర్థమవుతుంది.
" పర నేత్రముల కడ్డుపడకయమున్న " అనే పాదము అర్థం చేసుకొనడానికి కొంచెం కష్టంగా ఉంది. అయితే, కంటిచూపు పూర్తిగా తగ్గిపోయి ఇతరుల మీద ఆధారపడక ముందే " అని అర్థం చేసుకొనవచ్చేమో! వళులు అంటే ముడుతలు. " కాళి కడకంటి చూపు " , అనేది అంతిమ ఘడియల్లో కలిగే భయంకరమైన మృత్యుస్వరూపమేమో! కాలుడు (యముడు), కాళి, నల్లగా ఉండి, భయాన్ని కలిగించే స్వరూపాలు. మరణం సమీపిస్తున్న కొలదీ మృత్యుభయం యెక్కువ గదా!
సాధారణ సాహిత్యపరిచయమున్న నా వంటివారికి పైన చెప్పిన వాక్యాలకు అర్థం సుబోధకం కాలేదు. పెద్దల ద్వారా అర్థాన్ని మరింత చక్కగా చెప్పించుకొనగలరని విన్నపము.
No comments:
Post a Comment