హరు, బరమేశ్వరేశ్వరు, గృపాతిశయార్ద్రు, నమేయమూర్తి, శం
కరు, నచలైక భక్తిరసగమ్యుని, నవ్యయు, నిందుమౌళి, ద
త్పరమతి నాశ్రయించి అనపాయబలోద్భటశౌర్యసంపదన్
గురుతనయుండు గాంచి అధికుం డగుటం బగదీర్చె నమ్మెయిన్.
శివుడు ప్రసన్నుడైన నఱచేయునె ఎవ్వరికైన? రాజపుం
గవ! యమరత్వమైన, బలఘస్మరు గెల్వగ నోపునట్టి ద
ర్ప విభవమైన నిచ్చు, బరిపంథు లనేకుల నొక్కరుండు బా
హువిలసనంబు ఘోరముగ నోర్వగ జాలుట యీగి చోద్యమే?
తెల్లమి గాగ నేను శివదేవు నెఱుంగుదు, భూతసంచయం
బెల్ల జనింప, నిల్వగ, లయింపగ జేయు నతండె, అవ్విభుం
డుల్లమునం దలంప, భువనోత్కరవిశ్వవిధానయుక్తి వ
ర్తిల్లుచు నుండు, భక్తికి విధేయు, డమేయుడు కౌరవేశ్వరా!
బలఘస్మరు = బలాసురుడిని చంపిన వాడు; ఇంద్రుడు.
పరిపంథులు = శత్రువులు
అశ్వత్థామ నిద్రపోతున్న ఉపపాండవులను అతి దారుణంగా చంపాడు. అది నీచమైన చర్య. కానీ, అజేయుడైన ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామ చేతిలో చావటం, ధర్మరాజుని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్నే ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. దానికి సమాధానంగా కృష్ణుడు ఇదంతా శివుని ప్రభావమని, ఆ మహాదేవుని గొప్పతనాన్ని, దయాగుణాన్ని గురించి చెప్పసాగాడు.
" అశ్వత్థామ పరమేశ్వరుని కృపాకటాక్షములతో అజేయమైన శక్తిని సంపాదించి పాండవులపై పగ సాధించగలిగాడు. శివుని దయ ఉండాలి గాని, ఎవరికైనా లోటు కలుగుతుందా? ఆయన తలచుకుంటే, అమరలోక సుఖాన్ని కలిగిస్తాడు, ఇంద్రుడిని గెలిచేటంతటి బలపరాక్రమాలనూ ఇస్తాడు. అటువంటిది, శత్రుసమూహాన్ని తన భుజబలంతో, భయంకరంగా ఓడించే శక్తిని ఇవ్వడంలో పెద్ద వింత ఏమున్నది?
ధర్మరాజా! శివుని శక్తిసామర్థ్యాలు, మహిమ నాకు బాగా తెలుసు. సమస్త ప్రాణికోటి యొక్క సృష్టి, స్థితి, లయాలు అతని చేతిలోనే ఉన్నాయి. ఆయన మనఃసంకల్పం వల్లే సర్వలోకవ్యవహారాలూ జరుగుతుంటాయి. అతడు భక్తికి మాత్రమే లొంగేవాడు. అతని మహిమ, శక్తిసామర్థ్యాలు వర్ణించటం సాధ్యమా? "
అశ్వత్థామ శివాంశ సంభూతుడు. కురుక్షేత్ర మహాసంగ్రామం ద్వాపర కలియుగాల సంధికాలంలో జరిగింది. ఈ మహాసంగ్రామంలో భూమిపై నున్న రాజులందరూ పాల్గొన్నారు. ఎన్నో రాజవంశాలు నశించిపోయాయి. ఎంతో ప్రజాసంక్షయం జరిగింది. యుగాంతం వేళ, ఇంకా ఏమన్నా పని మిగిలి ఉంటే, ఆ పనిని అశ్వత్థామ పూర్తిగావించాడు. శివుని ప్రతినిధిగా లయమనే కార్యాన్ని నిర్వహించాడని అర్థం చేసుకోవాలి. ఈ విషయం లీలామానుషవిగ్రహుడైన శ్రీకృష్ణునికి తెలుసునని " తెల్లమి గాగ నేను శివదేవు నెఱుంగుదు " ఆన్న వాక్యంలోని లోతైన భావన అని మనం అర్థం చేసుకొనవచ్చు.
పై మూడు పద్యాలు శ్రీమదాంధ్ర మహాభారతము, సౌప్తికపర్వం, ద్వితీయాశ్వాసంలో ఉన్నాయి.
No comments:
Post a Comment