తనకున్ గుండల హేమనూతనహరిద్రాకాంతి కర్ణాంత కే
శనిపీతోగ్రవమ జ్జరాసితవిశేషాక్రాంతి డీల్పోయెడున్
తనకున్ షష్టిసహస్రవర్ష ధరణీతాత్పర్య చింతాచిరం
తనరేఖన్ బతయాళు తాలుచలితత్వక్పర్యయం బేచెడున్.
దశరథుడు రామునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. మహాపరిషత్తులో కొలువై ఉన్న మంత్రి, సామంత, దండనాథ,రాజప్రముఖ, పురోహితులను, ప్రజలను ఉద్దేశించి, తనకు వయోభారం మీద పడిన సంగతిని చెబుతున్నాడు.
దశరథుడు అప్పటికి అరవై వేల సంవత్సరాల నుండి రాజ్యం చేస్తున్నాడు. తాను ధరించిన బంగారు కుండలాల పచ్చని కాంతి, ముదిమి మూలంగా, చెవులపై పడిపోతున్న తెల్లని జుట్టు వలన, వన్నె తగ్గిపోతున్నది. కేశపాశాలు నల్లగా నిగ నిగ లాడుతూ ఉంటే, చెవులకు పెట్టుకొన్న కుండలాలు విశేషమైన కాంతిని చేకూరుస్తాయి. కానీ, వార్థక్యంతో రాలిపోతూ, పెదవులపై పడుతూ, వికారం కల్గించే, జుట్టు, కుండలాల కాంతిని తగ్గించివేస్తుంది కదా!
.
ఇక, అరవై వేల సంవత్సరాల నుండి భూమిని పాలించి, రాజకార్యభారం వహించి, అలసిపోయిన తనకు , వయస్సు కారణంగా, మాటలో వణుకును, తత్తరపాటును వస్తున్నాయని దశరథుడు చెబుతున్నాడు.
అంటే, తనకు వయోభారం మీద పడ్డదని, రామునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయక తప్పని పరిస్థితి యేర్పడిందని, అందరి ఆమోదం, ఆశీర్వాదం రామునికి లభించాలని దశరథుని ఆకాంక్ష.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యకాండము, అభిషేక ఖండము నందలి యీ పద్యానికి రేఖామాత్రంగా అర్థం స్ఫురించింది కాని, సుస్పష్టంగా తెలియలేదని అనిపిస్తున్నది. పెద్దలు మరింత చక్కని అర్థాన్ని చెబుతారని అనుకుంటున్నాను.
ఇంకొక విషయం. దశరథుడు అరవై వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసాడన్న అంశం సాంకేతికంగానో, ప్రతీకాత్మకంగానో ఉపయోగించబడిందేమో పెద్దల నుండి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. సనాతన సంప్రదాయంలో షష్టి (అరవై) సంఖ్య చాలా ప్రాముఖ్యత కలిగినది అనే విషయం గమనార్హం.
No comments:
Post a Comment