దారలయందు, బుత్ర ధన ధాన్యము లందు ననేక భంగులం
గూరిమి సేయు మర్త్యు డతి ఘోర వియోగజ దుఃఖమగ్నుడై
నేరుపు దక్కి, చిక్కువడి నీతి వివేక విహీనుడై మనో
భారముతో గపోతపతి భంగి నిజంబుగ బోవు నష్టమై.
యదుసంక్షయం తరువాత శ్రీకృష్ణుడు వైకుంఠానికి మరలిపోతాడని విన్న ఉద్ధవుడు చాలా బాధ పడ్డాడు. శ్రీకృష్ణునితో సన్నిహితంగా మెలిగిన తన వంటి వారు అతనితో ఎడబాటును ఏ విధంగా భరించ గలరని చింతాక్రాంతుడయ్యాడు. అప్పుడు కృష్ణుడు ఉద్ధవునికి తత్వాన్ని బోధించి, " అవధూత యదు సంవాదం " అనే పురాణేతిహాసాన్ని చెప్పాడు.
ఒకనాడు యదురాజు దగ్గరకు శంకరవేషధారియైన ఒక అవధూత వచ్చాడు. యదురాజు అవధూతను " ఎక్కడ నుండి వచ్చారు? " అని అడిగాడు. దానికి సమాధానంగా యోగి " తనను ఇరవై నలుగురు గురువులు విజ్ఞానఖనిగా తీర్చిదిద్దారని " చెప్పాడు. మళ్ళీ యదురాజు, దేహి అరిషడ్వర్గాలను ఏవిధంగా జయించి జనార్దనుని చేరతాడని అడిగాడు. అప్పుడు అవధూత చెప్పినదే ఈ పద్య విశేషం.
" భార్యాబిడ్డల పైన, ధన ధాన్యాల మీద విపరీతమైన మోహాన్ని పెంచుకుంటాడు మానవుడు. ఎప్పుడైతే అవి దూరమౌతాయో, అప్పుడు అమిత దుఃఖానికి లోనవుతాడు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోతాడు. దాని వలన నీతిని, వివేకాన్ని కోల్పోతాడు. చివరకు కథలో చెప్పిన పావురంలాగా నష్టపోతాడు. " అని ఆ పావురం కథ చెప్పాడు.
" అడవిలో ఒక పావురాల జంట, పిల్లలతో పాటు సుఖంగా గడుపుతూ, ఒకరి మీద ఒకరికి విపరీతమైన వ్యామోహంతో ఉండేవి. విధివశాత్తు, ఆడపావురం, పిల్లలు ఒకరోజు బోయవాడి వలలో చిక్కుకున్నాయి. ఆ దుఃఖాన్ని భరించలేక, కపోతపతి కూడా, ఆ వలలో దూరి, నశించిపోయాడు. మమకారం పెద్ద శత్రువు. అందువల్లనే, యోగీంద్రులు సంతత హరి ధ్యానంలో ఉంటారు. " అని చెప్పి తనకు " భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడుత, తుమ్మెదలు, ఏనుగు, తేనెటీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుముకిపిట్ట, బాలుడు, బాలిక, బాణాలు చేసేవాడు, పాము, సాలీడు, కందిరీగ " అనే ఇరవై నలుగురు గురువులని, వారి గుణగణాలను తెలిసికొని మెలుగుతుంటానని చెప్పాడు.
మహాభారతం, అశ్వమేధపర్వంలో, శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చేసిన తత్త్వబోధ కూడా ఇక్కడ గమనార్హం. మానవుని జీవితంలో " మమ (నాది) " అనే రెండక్షరాలు మృత్యువనీ, " న మమ (నాది కాదు) " అనే మూడక్షరాలు మోక్షహేతువని నిర్ద్వంద్వంగా చెప్పాడు. ఈ మమకారం పోనంతకాలం, నమః అనే శరణాగతి తత్వం రానంతకాలం, ఎన్ని భారత, భాగవత, రామాయణాలు చదివినా, విన్నా, విముక్తికి దారి కనుచూపు మేరలో కనపడదు. అంతవరకు, జీవితమనే నాటకంలో, మానవుడు విషాదాంత నాయకుడిగా మిగిలిపోతాడు.
No comments:
Post a Comment