మొలకచీకటి జలజల రాల్పగా రాదె
నెరులు మించిన వీరి కురుల యందు
కెరలించి అమృతంబు గిలకొట్టగా రాదె
ముద్దు సూపెడి వీరి మోవులందు
పచ్చ బంగారుకుప్పలు సేయగా రాదె
గబ్బి మీరిన వీరి గుబ్బలందు
పండువెన్నెల తేట పరిఢవింపగ రాదె
నగవు కుల్కెడి వీరి మొగములందు
ఔర! కరవాడిచూపుల యౌఘళంబు
బాపురే! భూరికటితటిభార మహిమ
చాగు! మదమందగమన లక్షణము లనగ
నేరుపుల మింతు రప్పురి వారసతులు.
ఈ పద్యం చదువుతుంటే మన తెలుగు భాష వైభవాన్ని ఎంతని పొగడవచ్చుననిపిస్తుంది. ప్రౌఢ కవిత్వం చెప్పడంలోను, అచ్చ తెలుగుపదాలతో కవిత్వం చెప్పడంలోను సవ్యసాచిత్వం నెరపినవాడు తెనాలివాడు. అందుకే ఆయన ' శారద నీ రూపము ' అనిపించుకోగలిగాడు.
పాండురంగ మాహాత్మ్యము ప్రథమాశ్వాసం లోని యీ పద్యం కాశీ లోని వేశ్యల వర్ణన.
నెరులు మించడం అంటే వంకరలు తిరగడం. అక్కడి వేశ్యల జుట్టు వంకరలు తిరిగిందట. వంకరలు తిరిగిన కురులు శృంగారాన్ని పెంచుతాయి. అవి ఎంత నల్లగా ఉన్నాయంటే, ఆ జడ నుంచి, చీకటిని జలజల రాల్చవచ్చునట. అంత నల్లగా ఉన్నాయి వారి జడలు. పూర్వం, జడ ఎంత పొడుగ్గా ఉండి ఎంత నల్లగా ఉంటే అంత సౌందర్యపోషకమని భావించేవారు.
వారి ముద్దులొలికే పెదవులను చిలకొట్టి అమృతం తీయవచ్చునట. అంటే, వారి పెదవులను ఆనితే అంత తియ్యగా ఉంటుంది.
ఇక వారి చనుగుబ్బలందు, పచ్చటి బంగారం కుప్పలు పోతపోయవచ్చునట. అంటే, అంత కఠినంగాను, కాంతివంతంగాను ఉంటాయి.
వారి నవ్వుముఖాలలో, పండు వెన్నెల తేట వెలిగించవచ్చునట. అంటే, వారి నవ్వు వెన్నెల కాసినట్లు, సన్నజాజులు విరిసినట్లు ఉంటుంది.
ఔర!, బాపురే!, చాగు! ఇవన్నీ ఆశ్చర్యాన్ని సూచించేవి. చెప్పలేనంత అందం మన కళ్ళెదుట సాక్షాత్కరిస్తే, యీ మాటలు వస్తాయి. ఆ మాటలను సందర్బోచితంగా చ్ఛందోబద్ధం చేయడం రామకృష్ణుని విశిష్టత. ఇటువంటి ఆశ్చర్యార్థకాలు ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది? వారి వాడి చూపులు, పెద్ద పిరుదులు, మెల్లని నడక, అటువంటివి కనుక. వారకాంతల, అంటే, వేశ్యల, విటులను ఆకర్షించే శారీరక లక్షణాలు యివి. ఇంతటి జాణలు ఆ ఊరిలోని వేశ్యలు.
వేశ్యలను వర్ణించాడని ఏవగించుకోనక్కరలేదు, ఎంత అందంగా పద్యం చెప్పాడన్నది ప్రధానం. అదీగాక, వేశ్యావర్ణనం ప్రబంథాలలో పరిపాటి.
No comments:
Post a Comment