కేళివనాళి నీయెడ శుకీనినదార్భటి చెప్ప నేల భూ
పాలక నీలకంఠములు పాయక మ్రోయు లతాంత వాసనా
జాలము సోడు ముట్ట సురసాలము వీడ్కొనివచ్చు షట్పదీ
మాలిక దోచు నబ్బురపు మబ్బుల యుబ్బులు గుబ్బతిల్లగన్.
వనపాలకులు వసుమహారాజుకు వసంతకాల మహిమను చెబుతున్నారు.
ఈ వసంత సమయంలో వనాల్లో ఆడచిలుకల సందడి చెప్ప నలవి కాదు. ఉద్యానవనంలోని పుష్పసౌరభం ఆకాశవీధి వరకు ప్రాకటం వల్ల, తుమ్మెదల బారులు కల్పవృక్షాన్ని విడిచిపెట్టి భూమార్గాన్ని పట్టాయి. అంటే, ఉద్యానవనాల్లోని పూల వాసన ఇంకా యెక్కువగా ఉంది. తుమ్మెదలు ఆ రకంగా బారులు తీరి వస్తూ ఉంటే, అవి మేఘమాలికలని తలచి నెమళ్ళు కేకారావాలు చేయడం మొదలుపెట్టాయి. ఆ మేఘాల సమూహాన్ని అబ్బురపు మబ్బు లనడం వల్ల, అవి అకాలమేఘాలని అర్థం చేసుకొనవచ్చును. సాధారణంగా, నెమళ్ళు వర్షాకాలంలో యెడతెగక ధ్వని చేస్తుంటాయి. కానీ, తుమ్మెదలబారులను చూసి, అవి భ్రమపడ్డాయి. కనుక అవి అబ్బురపు మబ్బులు అని కవి వర్ణించాడు.
పద్యంలోని ఇంకొక చమత్కార మేమంటే, శుకీనినదార్భటి (ఆడచిలుకల ముద్దుపలుకుల సందడి), నెమళ్ళకు ప్రత్యాయ పదంగా వాడబడిన నీలకంఠములు (కంఠం శబ్దానికి ఉత్పత్తి స్థానం) , తుమ్మెదల బారులు - షట్పదీమాలికలు (భ్రమరీగీతికలు) , అన్న పదాలు, పదబంధాలు వసంతఋతువులో ప్రకృతి రూపంలో మనను పరవశింపజేసే వివిధ జీవరాసుల ధ్వని సౌరభాన్ని గుబాళింపజేస్తున్నాయి. అంతేగాక, " లతాంత వాసనా జాలము సోడు ముట్ట " అన్న వాక్యవిన్యాసం, లతాంతాయుథుడైన మన్మథుణ్ణి గుర్తుకు తెస్తూ, అతని చెలికాడయిన వసంతుని ఇంద్రజాలాన్ని చూపిస్తున్నది.
ముఖ్యంగా, " అబ్బురపు మబ్బుల యుబ్బులు గుబ్బతిల్లగన్ " అన్న గకారం కొనసాగింపు పద్యానికి క్రొత్త అందాన్ని తెచ్చిపెట్టింది.
వసంతకాలపు అందాన్నంతా మనముందు ఆరబోసిన భట్టుమూర్తిగారి యీ పద్యం, వసుచరిత్రము ప్రథమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment