శ్రీరామేశ కవీశ్వరాదు లెద నీ శ్రీపాదముల్ భక్తితో
నారాధించి సమస్తలోకసముదాయాధీశులైరన్న సం
సారుల్ దుఃఖనివారణార్థ మభవున్ సర్వేశు లోకత్రయా
ధారున్ నిన్ మది గొల్వ కున్కి యుఱవే దారిద్రవిద్రావణా!
నన్నెచోడ మహాకవి కుమారసంభవము కావ్యము దశమాశ్వాసములో ' దారిద్రవిద్రావణా ! ' అనే మకుటంతో పది పద్యాలున్నాయి. ' దారిద్రవిద్రావణా ' అంటే ' దరిద్రమును పోగొట్టువాడా! ' అని అర్థం. ఈ పద్యాలు దేవగురువైన బృహస్పతి లోకగురువైన శివునికి నమస్కరించి చెప్పినవి.
" దారిద్ర్యమును పోగొట్టేవాడా ! శివా, విష్ణువు, బ్రహ్మ మొదలైనవారు నీ పాదపద్మాలను భక్తితో సేవించి ఎల్ల లోకాలకు ప్రభువులయ్యారు. అటువంటిది, సంసారులు తమ కష్టాలను పోగొట్టుకొనడానికి, పుట్టుకలేనివాడివి, సర్వలోకాలకు ప్రభువువి, ముల్లోకాలకు ఆధారభూతుడవు అయిన నిన్ను మనసులో నిలిపి, సేవింపకుండా ఉండటం సరైనదా? " కాదు అని భావము.
రామేశుడు అంటే లక్ష్మీదేవి భర్త, విష్ణువు. కవీశ్వరుడు అంటే, బ్రహ్మ.
ఈ స్తోత్రం బృహస్పతికృతం అని చెప్పబడింది కావున, సంసారజీవులమైన మనం, మన కష్టాలను, దుఃఖాన్ని పోగొట్టికొనడానికి భక్తిప్రపత్తులతో యీ పద్యాలను చదువుకుంటే, కష్టాలు తొలిగి, మనశ్శాంతి కలుగుతుంది. సంస్కృతంలో కుమారసంభవ కావ్యాన్ని రచించిన దేవి ఉపాసకుడు కాళిదాసు, దానిని స్వతంత్రకావ్యంగా రూపుదిద్దిన నన్నెచోడుడు మహనీయులు. వారి వాక్కు అమోఘమై అభీష్టసిద్ధి తప్పక కలిగిస్తుంది.
No comments:
Post a Comment