జని సాహస్ర బహు ప్రయాణ మగు సంసారంపు ద్రోవ న్సదా
చనుచుండున్ఘన మోహఖేద మలమ న్సంసారిపాంథుండు వా
సనలన్ ధూళి ముసుంగు గాగ; నెపుడేన్ జ్ఞానంపు టుష్ణోదకం
బున దత్క్షాళన సేయు, వాని కపు డమ్మోహ శ్రమంబున్జనున్.
విష్ణుచిత్తుడు, పాండ్యరాజు మత్స్యధ్వజునికి, ఖాండిక్య కేశిధ్వజ సంవాదాన్ని చెబుతున్నాడు.
కేశిధ్వజుడు ఖాండిక్యునికి ఆత్మబోధ చేస్తున్నాడు.
సంసారజీవి ఒక బహుదూరపు బాటసారి. జననమరణ చక్రంలో పడి ఎన్నో జన్మల ప్రయాణం చేస్తున్నాడు. దారిలో, మోహం, దుఃఖం అనే దుర్గంధాన్ని పీలుస్తూ, దుమ్ము ధూళిని సంస్కార రూపంలో పూసుకొంటున్నాడు. దుమ్ముధూళి కడిగివేసుకొని, విశ్రాంతి పొందాలంటే, వేడినీళ్ళ స్నానం చేయాలి. సంసారం లోని మోహం, దుఃఖం తొలగాలంటే, జ్ఞానమనే ఉష్ణోదకంతో స్నానం చేయాలి. అప్పుడే నడక శ్రమ పోతుంది, జననమరణ చక్రబంధం నుండి విముక్తి లభిస్తుంది.
ఆముక్తమాల్యద, తృతీయాశ్వాసం లోని యీ పద్యం జీవుని ఆధ్యాత్మ వేదనను తెలియజేస్తుంది. మొదటి పాదం లోని దీర్ఘాక్షరాలు జీవి యొక్క బహుజన్మల దూరప్రయాణాన్ని సూచిస్తుంది. ఉష్ణోదకంతో శ్రమను పోగొట్టుకొనడం, జ్ఞానార్జనతో, మోహదుఃఖాదులను తొలగించుకొనడంతో, అన్వయించడం, రాయలవారి కవితాశక్తికి నిదర్శనం.
No comments:
Post a Comment