వీరరసాంబుపూరమును విశ్రుతబాహు మహోగ్ర సత్త్వమును
జారుగదాధ్వజాచలవిశాలము నంబకజాలవీచికా
స్ఫారము నైన భీష్ముడను సాగరముం గడవంగ నీదగా
నేరిమి యెట్లొకో కలుగ నేర్చె శిఖండికి? నేమి సేయుదున్!
భీష్ముడు సముద్రము వంటి వాడు. సముద్రాన్ని యీదుకుంటూ దాటడం తేలికగాదు. భీష్ముడిని జయించడం అంత తేలికగాదు. ఈ పద్యంలో భీష్మునికి సముద్రానికి అభేదప్రతిపత్తి కల్పించబడ్డది. వీరరసం, సముద్రంలోని రసాంబుపూరాలుగా, బాహుబలసంపద, సముద్రము నందలి జలచరాలుగా, గదలు జండాలు, కొండలుగాను, బాణాలు కెరటాలుగాను, ఉన్నటువంటి భీష్ముడనే సాగరాన్ని శిఖండి, యెట్లా దాటగలిగాడు, ఈదగలిగాడు, అని ఆశ్చర్యం, ఆవేదన, అసహాయత వ్యక్తం చేశాడు ధృతరాష్ట్రుడు.
పాత్ర, సన్నివేశం స్వభావాన్ని అనుసరించి భాషను వాడటం మహాకవుల లక్షణం. అదివారి శిల్పచాతుర్యాన్ని చూపిస్తుంది. తిక్కన అందులో అందెవేసిన చేయి.
ఈ పద్యం తిక్కన భారతము భీష్మపర్వము ప్రథమాశ్వాసములో ఉన్నది.
No comments:
Post a Comment