నీ వచనంబు ధర్మ్యము, వినీతము, నీతియుతంబు, నిష్ట సి
ధ్యావహ, మత్యుదార మిదియైనను నిప్డు దలంపగా విచా
రావసరాప్తికిన్ విషయమైనది; కార్య ఫలంబు లెల్ల స
ద్భావమునన్ విచారసులభంబుల యండ్రు విచారపారగుల్.
ధర్మరాజు మెత్తనిపులి అన్నదానికి యీ పద్యం కూడా ఒక చక్కని ఉదాహరణ.
ధర్మార్థకామాలను సమతూకంగా అనుష్ఠించాలన్న భీముని మాటలు ధర్మరాజునకు అంగీకారయోగ్యం కాదు. అట్లాగని, అంగీకారం కాదని భీమునికి నేరుగా చెప్పడు. ముందు అతడిని పొగిడి, ఆ తరువాత, పెద్దల మాటలు అని చెప్పి, తను చెప్పదలచుకొన్నది చెప్పాడు. ఇదే లౌక్యం అంటే.
భీముని మాటలు ధర్మ సమ్మతంగా ఉన్నాయట. చక్కగా ఆలోచించి చెప్పినట్లుగా ఉన్నాయట. నీతితో కూడి ఉన్నాయట. ఆశయాలను నెరవేర్చేటట్లుగా ఉన్నాయట. ఉదాత్తంగా ఉన్నాయట. ధర్మరాజు లౌక్యమంతా " అయినను " అన్న అతుకులో ఉంది. అయినప్పటికీ, భీముడు చెప్పిన అంశం ఇప్పుడు చక్కగా ఆలోచన చేసి తేల్చవలసినదట. అంటే హడావుడిగా చేయవలసినది కాదని భావన. ఇటువంటి విషయాలన్నీ సద్భావనతో ఆలోచించడం వల్ల పరిష్కారం తేలికగా దొరుకుతుందని పెద్దలు చెబుతున్నారట.
నన్నయగారి భారతము, అరణ్యపర్వము, ప్రథమాశ్వాసము లోని యీ పద్యం ఎంతో అందంగా ఉంది.
No comments:
Post a Comment