జలంధర మంతయై కరటిచందము గైకొని సూకరాకృతి
న్నిలిచి పికంబుతో దొరసి నేరెడుపండును బోలె నుండ యై
కలశపయోధిమంథనముఖంబున బుట్టిన యమ్మహాహలా
హలము క్రమంబున న్శివుని హస్తసరోరుహ మెక్కె జుక్కగన్.
దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని చిలుకుతున్నారు. ఉన్నట్లుండి మహాహలాహలాగ్ని సాగర మధ్యం నుండి బయలుదేరింది. భయంతో అందరూ పారిపోసాగారు. ఆ విషాగ్నితో మూడులోకాలు తల్లడిల్లిపోయాయి. అందరూ వెళ్ళి రక్షించమని శివుణ్ణి వేడుకున్నారు. అప్పుడు విరూపాక్షుడు త్రైలోక్యరక్షాదక్షమైన తన కుడిచేతిని చాచి, హుంకరించి, నిలుచున్నాడు. పరమేశ్వరుని రౌద్రాకారాన్ని చూసి యుగాంతము నందు విస్తారముగా అలముకొన్న మేఘము వంటి గరళము స్తంభించి నిలిచిపోయింది. అలా మేఘంలా పరచుకొన్న కాలకూటవిషాగ్ని, తన పరిమాణాన్ని తగ్గించుకుంటూ, ఏనుగు రూపమంతదై, వరాహాకృతి దాల్చి, కోయిల అంత చిన్నదై, తరువాత నేరేడు పండులాగ ఉండ అయిపోయి, చిన్నదై, మరింత చిన్నదై, శివుని చేతిలో చుక్కగా అమరిపోయింది..
ముల్లోకాలను ఆక్రమిస్తున్న మహాహలాహలాగ్ని క్రమ క్రమంగా చిన్నదై, యెలా శివుని వశమైందో యీ పద్యం కళ్ళకు కట్టినట్లు చూపించింది.
ఆదిశంకరుల సౌదర్యలహరి 28 వ శ్లోకము, " సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం/విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః | కరాళం య త్క్ష్వేళం కబళితవతః కాలకలనా న శంభో స్తన్మూలం తవజనని తాటంకమహిమా || యీ సందర్భంగా గమనించదగ్గది.
ఈ శ్లోకానికి బ్రహ్మశ్రీ పాతూరి సీతారామాంజనేయులుగారి సుదీర్ఘ వివరణ జిజ్ఞాసువుల ఉపయోగార్థం ఇక్కడ పొందుపరుస్తున్నాను.
" ఈ శ్లోకమున ' శివుడు ' కరాళ (భయంకర) మగు క్ష్వేళమును ( విషమును) కబళించియు ' కాలకలనా ' కు అందక ఉన్నాడు, అని చెప్పబడినది. ' కాల ' అనగా లోక వ్యవహారమునకు ఉపయోగపడు త్రుటి - రెప్పపాటు - క్షణము - మొదలగు మనోగోచరవస్తువు అనియు, జీవించు కాలము ముగిసిన వారిని చంపు ' కాలుడు ' అనియు రెండు అర్థములు. శివునకు (పరమాత్మునకు) ఈ రెండు విధములగు వానిచేతను ' కలన ' ను 'వ్యాప్తి ' ని పొందుట లేదు. అతనికి ఆయువు ఇంత అనునది లేదు. అతనిని కాలుడు చంపడు అని అర్థములు. 'కాలకలన ' లేదు. అనగా ' కాల ' పు ' అకలనా ', ' కాలమునకు - కాలునికి లోబడకుండుట ' ఇతనికి కలదు. అనగా ' కాలకల(న) ము ' ను మ్రింగెను. తనకు లోబరచుకొనెను. వర్ణములను ఉచ్చరించు ప్రక్రియ ననుసరించి ' క ' ' హ ' వర్ణములు కంఠస్థానమున ఉచ్చరించబడును. అంతమాత్రము కాక తమిళులు చాల సందర్భములలో ' క ' ' ను ' హ ' అని ఉచ్చరింతురు. ఎట్లు చూచినను, ' కాలాకల ' శబ్దము 'హాలాహల ' ము అగుటకు అవకాశము కలదు.
ఈ విధముగ సూక్ష్మముగ ఆలోచించగా ఒక రహస్యము గోచరించును. దేవతలును దానవులును తమకు చావు లేకుండ చేయు అమృతమునకై క్షీరసాగరమును (జ్ఞానమును) మథించిరి. లభించినది అమృతము. దానిని త్రావినవారికి ప్రళయము నాడైన చావక తప్పదు. క్షీర (జ్ఞాన) సాగర పరమార్థము శాశ్వతత్త్వము, అనగా, కాలాతీతుడగుట. దానిని సాధించినవాడు శివుడు - హరి - దేవి - ఇట్లు నామభేదములతో నున్న పరతత్త్వము మాత్రమే. కనుకనే, ఆ పరతత్త్వము ( శివతత్త్వము కా(హా) లాక(హ) లమును - కాలాతీతతత్త్వమును మ్రింగెను.) యదార్థమగు అమృతత్త్వమును పొందెను అని రహస్యము. పురాణకథలలో శివుడు మ్రింగినట్లు చెప్పబడు విషము - వాస్తవమున విషము కాదు, అనియు - పరతత్త్వపు శాశ్వతత్త్వమే హాలాహలముగా చెప్పబడె ననియు ఎరుగవలెను. "
అందువలననే, శ్రీనాథ కవిసార్వభౌముడు " స్తంభించి నిలిచె గరళము/ శంభునిముందట యగాంతజలధరముగతిన్ " అని తెలిసి చేసిన ప్రయోగమిది. యుగాంతంలో అమృతము త్రాగిన వారు కూడా నశించవలసినదే, ఒక్క పరతత్త్వము తప్ప. అందువల్ల, యదార్థమైన అమృతత్త్వమనగా శివైక్యమే, బ్రహ్మాత్మ్యైకసంధానమే.
ఇంత మంచి పద్యం శ్రీనాథుని హరవిలాసము షష్ఠాశ్వాసంలో ఉన్నది.
"
No comments:
Post a Comment