ఇతడె యితండు కన్ను లొకయించుక మోడ్చిన నీ చరాచర
భువనంబు లన్నియు నశించు నితం డవి విచ్చిచూచినన్
వితతములై జనించు బ్రభవిష్ణుడు విష్ణుడు నైన యట్టి యీ
క్రతుఫలదుండుగా కొరు డొకం డెటు లర్హుడు శిష్టపూజకున్.
ఈ పురుషోత్తమున్ జగదధీశు ననంతుని సర్వశక్తు జి
ద్రూపకు నగ్రపూజ బరితోషితు జేయ సమస్త లోకముల్
వే పరితుష్టి బొందు బృథివీవర! కావున నీవు కృష్ణునిన్
శ్రీపతి బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్?
రాజసూయ యాగం సందర్భంగా, అగ్రపూజను అందుకొనడానికి, శ్రీకృష్ణుడు తప్ప ఇంకొకరు అర్హులు కారని, సహదేవుడు చెప్పిన మాటలివి.
" ఈ శ్రీకృష్ణుడు కన్నులు కొంచెం మూసుకున్నాడంటే ఈ సమస్త చరాచర ప్రపంచమంతా నశిస్తుంది. ఆయన కన్నులు తెరిచి చూసాడంటే, లోకాలన్నీ పుడతాయి. అందువల్ల, ఈ సమస్త సృష్టికి హేతువు, విశ్వవ్యాపకుడు, యజ్ఞఫలదాత అయిన ఈ శ్రీకృష్ణుడు తప్ప అగ్రపూజకు ఇంకెవరు అర్హులు?
అంతేగాక, మహారాజా! ఈ పురుషోత్తముడిని, సర్వ లోకాధీశుడిని, అనంతుడిని, సర్వశక్తిమయుడిని, జ్ఞానస్వరూపుడిని అగ్రపూజతో సంతోషింప జేస్తే, సమస్త భువనాలు పరిపూర్ణంగా తృప్తి నొందుతాయి. అందువల్ల, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఈ మహనుభావుడిని పూజించు. తక్కిన మాటలన్నీ అనవసరం. "
శ్రీకృష్ణుని అగ్రపూజకు సంబంధించిన ఈ పద్యాలు శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమ స్కంధంలో ఉన్నాయి.
No comments:
Post a Comment