వెలుగు మఱొక్క పే రఖిలవిద్యలకున్ బరమార్థభూతమై
వెలుగులు తన్ను మించి మఱి విశ్వమునందున వేఱుచోట లే
వలఘుడు శిష్యవత్సలుడు నంబుధి శోషాణ దాహమూర్తి వె
ల్గుల నిధికిన్ గురూత్తమునకున్ దగదక్షునకున్ నమస్కృతుల్.
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము సుందరకాండము పూర్వరాత్రఖండము నందలి యీ పద్యం ఉపనిషత్సారాన్ని తెలియజేస్తుంది.
సుందరకాడములోని మొదటి పద్యం యిది. శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటడనికి బయలుదేరుతున్న హనుమంతుడు, ఇష్టదేవతా ప్రార్థనలో ముందుగా తన గురువుగారికి నమస్కరిస్తున్నాడు. అంజనీసుతునికి వేదముల దగ్గరి నుంచి సర్వశాస్త్రాలను నేర్పిన గురువు సూర్యభగవానుడు. అందువల్ల, ఆయన అలఘువు, గొప్పవాడు. శిష్యవత్సలుడు. తాను నిరంతరం పరిభ్రమిస్తూ కూడా పాఠాలు నేర్పాడు. ఆయన అంబుధి శోషణ దాహమూర్తి, సముద్రజలాలను ఆవిరి రూపంలో త్రాగేస్తాడు. తనను యిప్పుడు సముద్రము దాటించి సీతాన్వేషణకు దారి చూపిస్తాడు. శిష్యవత్సలుడు కూడా కదా! సూర్యుడు వెలుగుల నిధి, గురువులలో ఉత్తమశ్రేణికి చెందినవాడు. ఎందువల్ల? వెలుగు అనేది జ్ఞానానికి మరొక పేరు. అన్ని విద్యల పరమ (మిక్కిలి) ప్రయోజనం జ్ఞానాన్ని పొందటం. పరమార్థం కూడా, లోపల నున్న వెలుగును దర్శించడమే! అన్ని విద్యలు ఖిలమైనవైతే, యీ లోపలి వెలుగును చూడటమే, అఖిలవిద్య, నశించని విద్య, ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం పొందటమే పరమార్థభూతమైనది, తెలుసుకొనదగినది. అందువల్ల, ఈ వెలుగును దర్శింపజేసేవాడు అన్నింటినీ దర్శించగలిగే వాడయ్యుండాలి. అనగా, జగదక్షి అయ్యుండాలి. సూర్యుడు జగత్తుకు కన్ను వంటివాడు. ఈ కారణం చేత గురూత్తముడు, జగదక్షి అయిన సూర్యభగవానుడు తనకు సీతాన్వేషణలో సహాయపడతాడు. సీతాన్వేషణ అంటే, మామూలు వస్తువును వెదకుట వంటిది గాదు. ఇది గవేషణ. దేనిని యదార్థముగా వెదకవలెనో దానిని వెదకుట. పరమార్థభూతమైన దానిని వెదకుట. పరమేశ్వరి దర్శనము చేయుట.
అందులకు, జగదక్షియైన గురూత్తముని అనుగ్రహము కావలెను.
ఈ పద్యము నందలి ధ్వని సౌరభమును ప్రపంచమునకు పంచిన గురూత్తములు ఆచార్య శలాక రఘునాథశర్మగారు. వారికి నమోవాకములు.
No comments:
Post a Comment